– 8 గంటల పని దినం బాబాసాహెబ్ చలవే
– మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాల భర్తీ
– మహిళల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నాం
– మే డే వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక లోకానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. మిర్యాలగూడలో శుక్రవారం పర్యటించిన ఆయన అక్కడ మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలను, అందులో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్నారు. 140 ఏళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినం కోసం ప్రాణాలర్పించి చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆనాడు ప్రభుత్వం, యాజమాన్యాలు చేసిన దాడిలో కార్మికులు చిందించిన రక్తంతో తడిసిన ఎర్ర జెండానే నేడు ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కుల పోరాటానికి చిహ్నంగా మారిందని తెలిపారు. చికాగో సంఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత జన్మించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని డిప్యూటీ సీఎం అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం 1942-46 మధ్య వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడే అప్పటివరకు ఉన్న 12-14 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాతగా కోట్లాదిమంది కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించి భరోసా ఇచ్చారని కొనియాడారు. కేవలం పురుష కార్మికులే కాకుండా మహిళా కార్మికుల సంక్షేమం కోసం అంబేడ్కర్ అనేక చట్టాలు చేశారని భట్టి విక్రమార్క వివరించారు. దేశంలో తొలిసారిగా మహిళలకు ప్రసూతి సెలవు హక్కును కల్పించింది ఆయనేనని తెలిపారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు ఆస్తిలో సమాన వాటా, వారసత్వ హక్కులు, విడాకులు, దత్తత తీసుకునే హక్కులను కల్పించి వారిని సామాజికంగా బలోపేతం చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం అని, పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలల్లోనే 30వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందజేశామని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నామని చెప్పారు. అంబేడ్కర్ ప్రసాదించిన రాజ్యాంగ స్ఫూర్తితో అణగారిన వర్గాల, కార్మికుల హక్కులను కాపాడుతూ పాలన కొనసాగిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




