పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయింది

– కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినందుకు బాధపడుతున్న ప్రజలు
– రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు వేయరు?
– సీఎస్ సంజయ్ జాజుతో పలు అంశాలపై చర్చించిన ఎంపీ ఈటల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్‌ను కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అంతకు మించి అన్నట్లుగా అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలాగానే రేవంత్ పాలన కూడా తయారయిందని విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఎంపీ ఈటల సచివాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కేంద్రం ఐదు కిలోల సన్న బియ్యం ఇస్తున్నా కార్డులపై ప్రధాని మోదీ ఫొటో లేదని మండిపడ్డారు. ఎవరి జాగీరని ఫొటోలు వేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ పాలకులను నిలదీశారు. బియ్యం ఇచ్చేది కేంద్రమైతే మీ బొమ్మలెందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ దిల్లీకి వచ్చి ఆశీర్వాదంతోపాటు మద్దతు కావాలంటారని, ఇక్కడికి తిరిగొచ్చి ప్రధానిపై విమర్శలు గుప్పిస్తారని వ్యాఖ్యానించారు. మోదీ దేశానికి ప్రధాని కాబట్టే రాష్ట్రానికి ఇన్ని రహదారులు, రైల్వే అభివృద్ధికి నిధులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీని బీఆరఎస్ అధినేత కేసీఆర్ లెక్క చేయలేదన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు మంచిది కాదన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇళ్లను పార్టీ నాయకులకు కేటాయించుకుంటున్నారని విమర్శించారు. తాత జాగీరు కాదు అలా చేయడానికి అంటూ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. మూడేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే రూ.100 కోట్లు అధికంగా కేంద్రం ఇచ్చిందన్నారు. మెట్రో ఫేజ్-1, ఫేజ్-2కు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలను కూడా కలిపారని పాలకులు చెప్పారని, కానీ వాటిని పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్(ఆరఓబీ), రైలు అండర్ బ్రిడ్జ్(ఆర్‌యూబీ) సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిని నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు. కేంద్రం సహకరిస్తుందని, కానీ రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కేంద్ర మంత్రి కోరారని ఎంపీ ఈటల తెలిపారు. ఈ అంశంపై సీఎస్‌తో మాట్లాడానని చెప్పారు. హైదరాబాద్‌లో అర్బన్, రూరల్ హౌసింగ్ స్కీం పనులు వేగంగా చేయాలని కోరానన్నారు. రైల్వే పెద్ద టెండర్లలో పాల్గొని నగదు తీసుకుంటున్నారని, కానీ చిన్నచిన్న టెండరల్లో పాల్గొనట్లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్లకు అమృత్ పథకంలో భాగంగా రూ.22 కోట్లు కేంద్రం ఇస్తుందన్నారు. అన్ని రైల్వే స్టేషన్లు ఫేస్ లిప్టింగ్ చేయడానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. మేడ్చల్, సికింద్రాబాద్ పరిధిలో గేట్ల వద్ద ఆర్‌వోబీ, ఆర్‌యూబీ నిర్మాణం జరుగుతోందని ఈటల తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *