– వరుస ఓటములతో భయపడిన రాహుల్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో బలంగా తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆల్ సెల్స్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బోగస్ ఓట్లను తొలగించి పారదర్శకంగా జాబితాను రూపొందిస్తే వరుస ఎన్నికల ఓటములతో భయపడిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓట్ చోరీ నాటకాలను ఎండగడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తోందన్నారు. ఎసఐఆర్పై వీళ్లు సాగిస్తున్న దుష్ప్రచారానికి హద్దు, అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. నిన్న కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసిన తర్వాత రాహుల్ గాంధీ మీడియా ముందు ఇంకో కొత్త నాటకానికి తెరలేపారని, తాము చెప్పిన ఆరోపణలకు రాష్ట్రపతి ఆధారాలు అడిగారని చెప్పారని, చేతిలో ఒక్క ఆధారం కూడా లేకపోయినా చివరకు రాష్ట్రపతి ఓటు చోరీని ఒప్పుకున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. ఆధారాలు చూపించలేక అబద్ధాలను అంటగట్టడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సెకండ్ ఫేజ్ ఎస్ఐఆర్ అనేది 4-5 నెలలపాటు సాగే సుదీర్ఘమైన ప్రక్రియ. మొదట బూత్ లెవల్ అధికారులు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు పరిశీలించి చనిపోయిన, వలస వెళ్లినవారి పేర్లను తనిఖీ చేసిన తర్వాతే ముసాయిదా లిస్ట్ ఇస్తారన్నారు. ఆ తర్వాత సమ్మరీ లిస్టుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే టైప్, ప్రింట్ లేదా చేత్తో రాసి కూడా ఫారమ్-7 అందజేయవచ్చు. దీనిపై ఈఆర్వో స్థాయి అధికారి పూర్తి విచారణ చేస్తారు.. అన్ని పార్టీల బీఎల్ఏలకు నోటీసులు ఇచ్చిన తర్వాతే పేర్ల తొలగింపులు జరుగుతాయి అని తెలిపారు. ఒకవేళ తొలగింపు తర్వాత కూడా ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసి క్లెయిమ్ చేసుకుంటే మళ్లీ పేరును చేర్చడానికి కూడా స్పష్టమైన పద్ధతి ఉందన్నారు. ఇంత పకడ్బందీగా జరిగే ఎసఐఆర్లో ఏకపక్షంగా పేరు తొలగింపు ఉండదన్నారు. ఒక్కరైనా ముందుకొచ్చి తమ పేరు డిలీట్ అయిందని చూపించారా అని ప్రశ్నించారు. ఏ ఆధారం లేనప్పుడు అసలు ఓట్ చోరీ ఎక్కడ జరిగినట్లు.. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అని రామచందర్రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





