– సీతారామ, సీతమ్మసాగర్, దేవాదుల కాంగ్రెస్ హయాంలోనే పూర్తి
– ఖమ్మం ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలే లక్ష్యం
– సాగునీటి రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం
– అన్ని అడ్డంకులను తొలగించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం/సత్తుపల్లి, జూలై 16: రాష్ట్ర రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చరిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్, దేవాదుల ఎత్తిపోతల పథకాలను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి రైతుల కలలను సాకారం చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సత్తుపల్లి టన్నెల్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి గురువారం పరిశీలించిన అనంతరం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు తమ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు.
సీతమ్మసాగర్‌కు చట్టబద్ధ మార్గంలో గ్రీన్ సిగ్నల్
సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం అవసరమైన పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమర్థంగా పోరాడుతోందని, అవసరమైన అన్ని కేంద్ర అనుమతులు సాధించి చట్టబద్ధంగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన 67 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి కేంద్ర జల సంఘం తుది అనుమతి ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ గొప్ప విజయమని మంత్రి పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తి మరింత వేగవంతం కానుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి సాగు భూమికి గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, సాంకేతిక అంశాలన్నింటినీ వేగంగా పరిష్కరించి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కాళేశ్వరం పునరుద్ధరణ శాస్త్రీయంగానే
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ సూచనల మేరకు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కొనసాగుతోందని మంత్రి తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయి భద్రతా ధ్రువీకరణ లభించిన తర్వాతే బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకుండానే తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో పంట పండించారని మంత్రి తెలిపారు. యాసంగి సీజన్‌లో సుమారు 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి దాదాపు రూ.19 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు దాదాపు రూ.80 వేల కోట్లకు పైగా నేరుగా చెల్లించినట్లు వెల్లడించారు.
నీటిపారుదల శాఖకు కొత్త దిశ
నీటిపారుదల శాఖలో వెయ్యికి పైగా ఇంజినీర్ల నియామకం, దాదాపు 1,800 మంది ఫీల్డ్ సిబ్బంది నియామకం, పెండింగ్ పదోన్నతుల మంజూరు వంటి చర్యలతో శాఖకు కొత్త ఊపు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. రైతుల శాశ్వత ప్రయోజనాల కోసం, ప్రజల భద్రత కోసం, శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగానే ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





