– ఉత్తర తెలంగాణ జిల్లాల ఉద్యమకారులతో ‘కమిటీ’ ముఖాముఖి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఉద్యమకారులు స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు కొనియాడారు. అమరవీరుల స్మారక చిహ్నం(అమరదీపం)లో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో కమిటీ బుధవారం ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. నాడు వివక్షకు వ్యతిరేకంగా అడవి బిడ్డలు మొదలుకుని పట్టణ ప్రాంత ప్రజలు, విద్యార్థి లోకం, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు సరిహద్దు జిల్లాల్లో రహదారులను స్తంభింపజేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారని, ఆనాటి పోరాట పటిమే నేటి స్వరాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాది అని కమిటీ స్పష్టం చేసింది. సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు, సభ్యుడు ప్రొఫెసర్ ఎమ్.కోదండరామ్, కార్యవర్గ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, ఎస్.రాములు నాయక్ తదితరులు హాజరై, సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన పోరాటయోధుల సలహాలను, సూచనలను, నాటి ఉద్యమ ఆధారాలను పరిశీలించారు.
ఉద్యమకారులు సమర్పించిన ప్రధాన వినతులు
నాలుగు జిల్లాల ప్రతినిధులు, క్షేత్రస్థాయి యోధులు తమ భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని కోరుతూ కమిటీ ముందు తమ ప్రధాన డిమాండ్లను ఉంచారు. 250 గజాల నివాస స్థలం- సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి 250 గజాల భూమిని ఉచితంగా కేటాయించి రిజిస్ట్రేషన్ చేయించాలి. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించడానికి గౌరవప్రదమైన నెలవారీ జీవితకాల పెన్షన్ అందించాలి. నాటి పోరాటంలో చదువులు, ఉద్యోగావకాశాలు కోల్పోయిన ఉద్యమకారుల పిల్లలకు విద్యా సంస్థల అడ్మిషన్లలో, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక కోటా కల్పించాలి. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళా పోరాట యోధులకు ప్రత్యేక స్వయం ఉపాధి పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయాలి. గుర్తింపు పొందిన ఉద్యమకారుల పిల్లలకు లేదా వారి తదుపరి తరానికి కేజీ నుండి పీజీ వరకు పూర్తి ఉచిత విద్యను అందించాలి. వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో జీవితకాల ఉచిత ప్రయాణ రవాణా పాస్ సౌకర్యం కల్పించాలి.
కమిటీ సభ్యుల హామీ
కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ పోరాట గడ్డల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి ఆవేదనను, డిమాండ్లను కమిటీ సానుకూలంగా రికార్డు చేసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంక్షేమ అంశాలు ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు.. మీ రక్తం, చెమట చిందించి సాధించుకున్న మీ ఆత్మగౌరవ హక్కు అని పేర్కొన్నారు. ఏ ఒక్క నిజమైన ఉద్యమకారుడికి అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





