ఆదిలాబాద్ సీసీఐని వెంటనే తెరిపించాలి

– కేంద్ర మంత్రి కుమారస్వామికి బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి
– తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం లేదు
– వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలి
– సీసీఐ తెరిచేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది
– పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్లాంట్‌ను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇత‌ర‌ ముఖ్య నేతల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో సిసిఐ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి స్పష్టం చేశారన్నారు. సిసిఐ ప్లాంట్ పునఃప్రారంభం కావడానికి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహం, చిత్తశుద్ది ఎంతో అవసరమని కెటిఅర్ పేర్కొన్నారు. కేంద్రం అడిగిన వివరాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో, ఎంత పెట్టుబడి పెడుతుందో వెంటనే బహిరంగంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. మారుమూల ప్రాంతానికి చెందిన వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సిసిఐ ప్లాంట్‌ను తిరిగి తెరిపించే వరకు బిఆర్‌ఎస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని నేతలు స్పష్టం చేశారు. కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి జోగురామన్న, రాజ్యసభ బిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో సిసిఐ సాధన సమితి సభ్యుల బృందం ఈరోజు కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించింది. దాదాపు అరగంట సేపు సాగిన ఈ సమావేశంలో ప్లాంట్ పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న ఆటంకాలపై క్షుణ్ణంగా చర్చించారు. 1980వ దశకంలో ఏర్పాటైన ఆదిలాబాద్ సిసిఐ ప్లాంట్ ఒకప్పుడు 6000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించి ఆ ప్రాంతానికి జీవనాధారంగా నిలిచిందని గుర్తుచేశారు. ఇక్కడ రాబోయే 100 సంవత్సరాలకు సరిపడా లైమ్‌స్టోన్ (సున్నపురాయి) నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల ఈ ప్లాంట్‌ను తిరిగి విజయవంతంగా నడపడానికి అన్ని రకాల అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ హన్సరాజ్ గంగారామ్ ఈ ప్లాంట్‌ను తప్పకుండా తెరిపిస్తామని స్వయంగా హామీ ఇచ్చారని, కానీ నేడు క్షేత్రస్థాయిలో దీన్ని తెరిపించాల్సింది పోయి తుక్కు (స్క్రాప్) కింద మార్చి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త‌మ‌ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కెటిఅర్ తెలిపారు. ఇక్కడ రూ.2000 కోట్ల పెట్టుబడితో సరికొత్త ఫ్యాక్టరీని పెట్టినట్టయితే బాగుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ప్లాంట్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన ఆటంకంగా మారిందని నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి అనేక సందర్భాల్లో చేసిన ఒత్తిడి ఫలితంగా సిసిఐ ఆదిలాబాద్ పునరుద్ధరణ పైన సానుకూలంగా ఉన్నట్టు కేటీఆర్ తెలిపారు. అయితే సిసిఐ పునరుద్ధరణ కోసం గత ఏడాది కాలంగా కేంద్రం ఇన్సెంటివ్స్, పవర్ సబ్సిడీ, క్యాపిటల్ సబ్సిడీ, జిఎస్‌టి మినహాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కోరుతున్నాస్టేట్ గవర్నమెంట్ స్పందించకుండా విషయాలను దాటవేస్తోందని, మైనింగ్ లీజ్ పొడిగించడానికి ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండి అదిలాబాద్ జిల్లా ప్రజలంతా దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న సిసిఐ పునరుద్ధరణపై కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పూరిత వైఖరిపై కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిసిఐ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం తరఫున పెట్టుబడి ప్రణాళికలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *