– వారికి ఇబ్బంది కలిగించకుండా కొనుగోళ్లు జరపాలి
– కొత్త నిబంధనలు ఎత్తివేయాలి
– సీసీఐ సీఎండీతో మాట్లాడిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యధావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. తేమ శాతం, స్లాట్ బుకింగ్‌పై పత్తి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. జిన్నింగ్ మిల్లర్లు లేవనెత్తిన డిమాండ్స్‌పై కూడా వివరించారు. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే పత్తి కొంటామనే నిబంధన ఎత్తివేయాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తిలో తేమ 12 శాతం పైగా ఉన్నా కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీఐ కొత్త నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్లు సమస్యలపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రైతులు, ప్రజాప్రతినిధుల విజప్తి మేరకు ఈ సీజన్‌లో మక్కల దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎకరానికి 25 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ ఎండీని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈమేరకు వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
‘రైతు నేస్తం’లో భూసార పరీక్ష పత్రాల పంపిణీ
‘వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరిగిన 74వ ఎపిసోడ్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు భూసార పరీక్ష పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతీ రైతు భూసార పరీక్ష చేయించుకోవడం వల్ల వారి భూముల్లో ఎంత శాతం పోషకాలున్నాయో తెలుస్తాయని, తద్వారా పంటల సాగుకు అనుకూలంగా ఇంకా ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుస్తుందని, కావున భూసార పరీక్ష పత్రం ఆధారంగా ఎరువుల వాడకంతో ఎరువులపై ఖర్చు తగ్గడమేకాక భూమి ఆరోగ్యం కూడా కాపాడినట్లవుతుందని తెలిపారు. నీటి వసతి కలిగిన ప్రతీ రైతు వరి, పత్తి పంటల బదులు ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాలని, తద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని, ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నదని, అంతర పంటలుగా కోకో, మిరియాలు, వక్క సాగు చేయడం వల్ల ఒకే భూమిలో ఎక్కువ రకాల పంటలతో అధిక ఆదాయం పొందవచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న ఆర్.గోపాల్ రెడ్డి, నల్గొండ జిల్లా నుండి రామచంద్రా రెడ్దిల విజయ గాధలను రైతులతో పంచుకున్నారు. భూసార పరీక్ష ఫలితాల ద్వారా ఎరువులు వాడుకునే విధానంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ మాధవి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





