– సచివాలయ ఉద్యోగులకు శాపం
– ఆర్టీసీ కార్మికులకు ద్రోహం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: తెలంగాణలో పాలనను గాలికి వదిలేశారని, కాంగ్రెస్ అరాచకంలో సామాన్య ప్రజలు, కార్మికులు, చివరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే నిలయం సెక్రటేరియట్‌లోనే ఇవాళ ఉద్యోగులు భోజన విరామ నిరసన చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉందో అర్థమవుతోందన్నారు. పీఆర్సీ అమలు లేదు.. పెండింగ్ డీఏలు రావు.. హెల్త్ కార్డులు పనిచేయవు.. చివరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఓపీఎస్ హామీని కూడా గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్లెక్కిన సచివాలయ ఉద్యోగుల ‘భోజన విరామ నిరసన’కు, 22 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోందన్నారు. తమ హక్కుల కోసం, విలీనం కోసం ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికులను చూసి ప్రభుత్వం వణుకుతోందని, అందుకే కొన్ని జేఏసీలో లేని సంఘాలతో లాలూచీపడి కార్మికుల ఐక్యతను దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే కార్మికులను మోసం చేశారన్నారు. పీఆర్సీ, ఎరియర్స్ అడిగితే కుట్రలు చేస్తారా.. మీ అసమర్థతకు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను బలి చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా సమ్మెల బాట పట్టినా, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నా సీఎంకి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. ఆయనకు తన వ్యక్తిగత ప్రతిష్ట నిర్మాణం మీద ఉన్న ధ్యాస ప్రజల సమస్యల మీద లేదని ఎద్దేవా చేశారు. జాతీయ నాయకుడిగా ఎదగాలనే ఆరాటంతో దేశాన్ని విడగొట్టేలా నార్త్ వర్సెస్ సౌత్ అంటూ విషం చిమ్ముతున్నారన్నారు. ప్రధాని మోదీ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొస్తున్న చరిత్రాత్మక చట్టాన్ని అడ్డుకోవడానికి వితండవాదాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. డీలిమిటేషన్ పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ మహిళల హక్కులకు గండికొట్టాలని చూడటం దుర్మార్గమని రామచందర్‌రావు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే సీఎం మాత్రం దిల్లీ పర్యటనలు, రాజకీయ వక్రీకరణలు, విద్వేషాలు చెచ్చగొట్టడంలో మునిగిపోయారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తక్షణమే సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణమైన సమస్యలను పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని రామచందర్‌రావు తెలిపారు.
మహిళా సాధికారత డిమాండ్‌ను నెరవేరుస్తున్న మోదీ
మహిళా సాధికారత కోసం ముప్పయ్యేళ్లకు పైగా దేశ మహిళలు ఎదురుచూస్తున్న చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ డిమాండ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని రామచందర్‌రావు తెలిపారు. 2023లో చట్టంగా మారిన నారీశక్తి వందన్ అధినియం రాజ్యాంగ సవరణ ద్వారా 2029 నుండి అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇది దేశ మహిళల సాధికారత దిశగా ఒక చరిత్రాత్మక నిర్ణయమన్నారు. పల్లవి కాలేజీలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సాండ్ ఆర్ట్ కార్యక్రమంలో పాల్గొని మహిళల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





