– కేసీఆర్ ఇంటిపై దాడికి తెగబడ్డారు.. మాపైనా ఉసిగొల్పారు
– ఠాణాలోనే నా పీఏ, పీఆర్‌వోలపై 15మందితో దాడులు చేయిస్తారా?
– ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయని దౌర్భాగ్యం
– కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం
– దిల్లీ వేదికగా రేవంత్ సర్కారు అరాచకాలపై భగ్గుమన్న కేటీఆర్
దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, పోలీస్ స్టేషన్లలోనే దాడులకు తెగబడే స్థాయికి కాంగ్రెస్ అరాచక పాలన చేరిందని బీఆ ర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత, ప్రజల చేత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంటిపై వేలమంది గూండాలను పంపించి దాడి చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లనే అడ్డాగా చేసుకుని హత్యాకాండకు తెరలేపిందని మండిపడ్డారు. దిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టారు. కేసీఆర్ ఇంటిపై దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన తమను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ కూడా తమపైకి గూండాలను ఉసిగొల్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ దుర్మార్గం చాలదన్నట్లు నిన్న విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తన పీఆర్‌వో మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిలపై ఏకంగా 15మందితో దాడి చేయించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లోపలే మఫ్టీలో వచ్చి దాడి చేసిన ఆ 15మంది గూండాలా లేక పోలీసులా అనేది తేలాలని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ఐదు గంటలపాటు నిలదీసి జీరో ఎఫఐఆర్ చేయమన్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేని అత్యంత ఘోరమైన, దిగజారిన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.
పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారారు.. న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం
రాష్ట్రంలో పోలీస్ శాఖ అధికార పార్టీ తొత్తుగా మారి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాణాలోనే దాడులు చేస్తున్న దుండగులకు పోలీసులు వత్తాసు పలుకుతూ రక్షణగా నిలుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను నమ్ముకుంటే న్యాయం జరగదని ప్రజలకు, తమకు పూర్తిగా అర్థమైందని.. అందుకే ఈ దాడులు, పోలీసుల తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నామని స్పష్టం చేశారు. కోర్టుల్లో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు. తాము ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ప్రజలకు సమాధానం చెప్పుకోలేక నిరాశానిస్పృహలతోనే రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజా క్షేత్రంలోనే ఈ అరాచక సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





