– బిఆర్ఎస్ ది స్కీంల ప్రభుత్వం
– దేవుళ్లపై ఒట్లు పెట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే
– రూ.30వేల కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టింది
– పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపని సీఎం
– పాలమూరుకు తీవ్ర అన్యాయం
– జడ్చర్ల పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 30: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అడుగడుగునా రైతులను మోసం చేస్తూనే ఉందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు పాలమూరు జిల్లా పరువు తీసేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహిస్తున్నది ఆశీర్వాద సభ కాదని, అది ముమ్మాటికీ రైతు వంచన సభేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్లలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను సభలో ప్రదర్శించిన హరీష్ రావు.. సీఎం అనుచిత వ్యాఖ్యల వల్ల ముఖ్యమంత్రి కుర్చీ విలువ కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా, ప్రజలకు ఏం కావాలో ముందే గుర్తించి పనులు చేసేవారని హరీష్ రావు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగానికి ఇచ్చిన బోనస్ హా అంతా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని, మార్కెట్లలో తరుగు పేరుతో నిరుపేద రైతులను దారుణంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చివరకు రైతులకు సకాలంలో యూరియా ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. షాపుల్లో అసలు యూరియా స్టాక్ ఉంచడం లేదు కాబట్టే.. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి యాప్ లంటూ కొత్త కథలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఇదే క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై కూడా హరీష్ రావు చమత్కరించారు. జిల్లా మంత్రిగా ఉన్న జూపల్లి అసలు ఏం మాట్లాడుతాడో, ఎందుకు మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదంటూ ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో జిల్లా మంత్రులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని, కాంగ్రెస్ మార్క్ మోసపూరిత పాలనపై రైతాంగం తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని హరీష్ రావు హెచ్చరించారు.జడ్చర్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో రైతుల ఆశీర్వాద సభ టింగ్ పెట్టిండు. నా దృష్టిలో రైతులను అడుగడుగున వంచించినవ్ కదా.. అది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు ఇస్తామని హానిచ్చిర్రు.. కానీ ఇచ్చిందెంత రూ.12 వేలు.. అవి కూడా ఒక పంట మొత్తానికే 9వేలు ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చాడు. ఇంకో పంట 2 ఎకరాల వరకే ఇచ్చాడు.. వాళ్లిచ్చిన ప్రకారం లెక్క తీస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుపై రూ.29300 కోట్లు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడిందన్నారు హరీష్ రావు. జడ్చర్ల సభ నుంచి అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు పెట్టుకున్న ఈ రైతు వంచన సభలో రూ.29300 కోట్లు ఎప్పటిలోపు ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నానన్నారు హరీష్ రావు. ఈ బాకీ బడ్డ రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా తిరిగిస్తావో చెప్పలని రైతుల పక్షాన, బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నానన్నారు.
ప్రజల దృష్టి మరమరల్చేందుకే పబ్లిసిటీ స్టంట్లు
హైదరాబాద్ : రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, రైతుల సమస్యలను పక్కన పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమిటి? అవే చేతగాని మాటలు, చెత్త వాగుడు తప్ప కొత్తగా ఏమైనా ఒరిగిందా? అని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఒకే సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజం? చేసింది లేదు కాబట్టే ఇష్టం ఉన్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82 వేల కోట్లు అయితే, జూన్ 2026 నాటికే లక్షా 56 వేల కోట్లు, లక్షా 75 వేల కోట్లు ఎలా ఖర్చు చేశారు? బడ్జెట్‌లో లేని డబ్బును ఖర్చు చేశారా? లేక రైతులను మభ్యపెట్టడానికి కల్పిత లెక్కలు చెబుతున్నారా? అబద్ధాలను పదిసార్లు చెప్పినా అవి నిజాలు కావు. లేనివి ఉన్నట్లు చెప్పినంత మాత్రాన రైతులు నమ్ముతారా? ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఓట్లు అడిగారు. ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. స్వల్పకాలిక రుణాలకే పరిమితం చేస్తామని ముందే చెప్పి ఉంటే రైతులు కాంగ్రెస్‌ను నమ్మేవారా? మేనిఫెస్టోలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనం. ఫేక్ ప్రచారం చేసుకోవడం కాదు.. రైతులకు ఇచ్చిన హామీల అమలు కావాలి. లేనిపక్షంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. రేవంత్ రెడ్డి… మీరు రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేశారో, అన్నదాతను ఎలా మోసం చేసారో చేర్చేందుకు అసెంబ్లీ మాత్రమే కాదు ఏ వేదికలోనైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





