– కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం
– ఎన్ని అడ్డంకులున్నా వరి సాగులో దేశంలో నెంబర్ వన్
– అర్హులైన రైతులకు విజయవంతంగా రైతుభరోసా నిధులు
– కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి
– మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు పెట్టించాం
– ఆర్టీసీ, సింగరేణిని లాభాల్లోకి తెచ్చాం
– రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల రాజ్యమని, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్ల రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలంగాణ వరి సాగులో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని సీఎం అన్నారు. వేల కోట్ల రూపాయల కమీషన్ల కోసమే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపించారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, అయినప్పటికీ బోరు బావుల కింద రైతులు పండించిన పంటలను కూడా కాళేశ్వరం మహిమ అంటూ గత పాలకులు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మూడేళ్లలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారన్నారు. పాలమూరు-రంగారెడ్డితోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి, ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు.వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో నిధులు అందిస్తూ కరవు పీడిత ప్రాంత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జూన్ 2,2014 న తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న అప్పు 69 వేల కోట్లు మాత్రమే. 2023 డిసెంబర్ 7 నాడు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల అప్పు వున్నదన్నారు. 60 యేళ్లలో 69 వేల కోట్ల అప్పులు చేస్తే కేవలం కల్వకుంట్ల కుటుంబం 7 లక్షల కోట్ల కు పైగా అప్పు చేసి అప్పుల ఊబీలో నిండా ముంచారన్నారు. మేం 6 లక్షల అప్పులు చేశారని ఎన్నికల సమయంలో విమర్శిస్తే కాంగ్రెస్ అబద్దాలు చెపుతుందని బుకాయించారన్నారు. కష్టమైనా ఫస్టు తారీఖున జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించాను. బడి పిల్లల కూరగాయలు, బట్టలకు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారు. సర్పంచ్ లకు వందల కోట్లు బకాయిలు పెట్టారు.. సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధర్నాలు చేశారు. బకాయిలు పెట్టింది బకాసురులు.. కట్టే పని మాత్రం నాకు పడిందన్నారు. స్వయం సహాయక మహిళలు బడి పిల్లలకు వండి పెడితే వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వలేదు. హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మైస్ ఛార్జీలు ,కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వలేదు. 30 నెలల్లో సమాజంలో గౌరవం పెంచుకుని , విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. 25.35 లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద ప్రభుత్వం రాగానే 7 వేల కోట్ల రూపాయలు చెల్లించాం. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో బకాయిలు పెట్టిపోతే 2023 లో చెల్లించాం. రైతు భరోసాను 12 వేల కు పెంచి ఇప్పటి వరకు 27 వేల కోట్లు రైతు ఖాతాల్లో వేశాం. ఈ విడుత తో కలిసి 36 వేల కోట్ల రైతు భరోసా కింద చెల్లించాం. ఉచిత కరెంటు ను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పెటెంట్. ఉచిత కరెంటు మాది అన్న సన్నాసులను ఆడబిడ్డలు చీపురుకట్టలు తిరగేసి కొడతరన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అని ఇప్పుడు విమర్శిస్తున్నారన్నారు. నెలకు 1000 కోట్ల రూపాయలను ఉచిత కరెంటు కోసం ఖర్చు చేస్తున్నాం.. ఇప్పటి వరకు 30 వేల కోట్లు ఖర్చు చేశాం. సన్న వడ్ల బోనస్ కోసం 4 వేల కోట్ల ఖర్చు చేశాం. మూడు న్నర వేల కోట్ల రైతు బీమా కోసం ఖర్చు చేశాం. ఇప్పటి వరకు లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం.. నెలకు 6 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు.. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు.. కోటీ ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి తాగుడు కల్చర్ పెట్టాడు. మేం రైతు బజార్లు తెస్తే కేసీఆర్ బెల్ట్ బజార్లు తెచ్చాడు. పిల్లలను కూడా కేసీఆర్ తాగుబోతులను చేశాడు. ప్రతి పేదవాడి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానని మోదీ చెప్పాడు.. యేడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి ..వచ్చాయా..? తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చే ప్రభుత్వం మాదే అంటున్నాడు.. ఏందీ వచ్చేది.. తెలంగాణలో ఆటలు సాగవన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 8 వేల కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఆర్టీసీ 1000 కోట్ల లాభాల్లోకి వచ్చింది.. సింగరేణి లాభాల్లోకి తెచ్చాం. ధరణి ని బంగాళాఖాతంలో వేసి భూభారతి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం.. ఇప్పటి వరకు 11 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వద్దని ఆటో వాళ్లను రెచ్చగొట్టి ధర్నాలు చేయించే ప్రయత్నం చేశారు. 1000 బస్సులకు మహిళా సంఘాలను యజమానులను చేశాం. స్వయం సహాయక మహిళలతో 1000 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను పెట్టించాం. రిలయెన్స్ తో పోటీ పడేలా మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం.స్వయం సహాయక మహిళల స్టాల్స్ కోసం 1000 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని శిల్పారామంలో కేటాయించాం. యాదయ్య, యాదిరెడ్డి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్లు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారు. కేసీఆర్ తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఇప్పటి వరకు మేం 30 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ చేశాం.. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామన్నారు. కిరిటాలు పెట్టుకోవాలి, వజ్ర వైడూర్యాలు సంపాదించాలని నాకు లేదు.. పదవి శాశ్వతం కాదు. మాట శాశ్వతం.. మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అన్న పేరు కోసం ప్రయత్నం. అబద్దాల పునాదులపైన ప్రభుత్వాన్ని నడపనన్నారు. కాలానికి తగ్గట్లుగా రైతులు వ్యవసాయాన్ని మార్చుకోవాలన్నారు. డిమాండ్ ఉన్న సన్న వడ్ల ను వేయమని రైతులకు చెపుతున్నాం. 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇస్తామంటే వద్దని అంటున్నారు. మూసీ వద్దని, మెట్రో వద్దని, రీజనల్ రింగ్ రోడ్డు వద్దని అంటున్నారు. పోర్లు దండాలు పెట్టినా అన్ని పనులు చేస్తా. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత రైతులదన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





