అబ‌ద్ధ‌పు ప్రచారాలను తిప్పికొట్టాలి

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– ప‌దేళ్లు పాలించి అప్పుల వూబిలోకి నెట్టారు
– రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ఖ‌ర్చు రూ.2,88,670 కోట్లు 
– రెండున్న‌రేళ్ల‌లో కాంగ్రెస్ రూ.1,56,496 కోట్లు
– ఆరు నూరైనా ప్ర‌భుత్వం మాట నిల‌బెట్టుకుంటుంది
– డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30:  “పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి, అప్పుల ఊబిలోకి నెట్టిన మాజీ పాలకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్రంపై బావ, బామ్మర్దులు (కేటీఆర్, హరీష్ రావు) అడ్డగోలుగా అబద్ధపు కట్టుకథలు అల్లుతూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతాంగం తిప్పికొట్టాలి” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  ధ్వజమెత్తారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన  రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పది సంవత్సరాల ఆనాటి పాలనలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, కేటీఆర్ ఈరోజు బావ, బామ్మర్దులుగా కలిసి రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పదేళ్లు మంత్రిగా పనిచేశాక కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్న తీరు బాధాకరం” అని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల కోసం జరిగిన ఖర్చుతో పోలిస్తే, తమ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తుందని  గణాంకాలతో సహా వివరించారు. “గత ప్రభుత్వం పదేళ్లలో రైతుల కోసం కేవలం 2,88,670 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. అంటే నెలకు సగటున 2,532 కోట్లు, ఏడాదికి 30,364 కోట్లు మాత్రమే వెచ్చించారు. కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏళ్లలోనే 1,56,496 కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు చేసింది. అంటే నెలకు 5,217 కోట్ల చొప్పున, ఏడాదికి 62,604 కోట్ల రూపాయలను రైతు సంక్షేమం కోసం వెచ్చిస్తున్నాం. ఇది గత పాలకులు ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు” అని ఆయన స్పష్టం చేశారు. గత పాలకులు తెచ్చిన 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని తమ ప్రభుత్వం మోస్తోందని  గుర్తు చేశారు. ఆ అప్పులకు సంబంధించి కేవలం రెండున్నర ఏళ్లలోనే 2,08,557 కోట్ల రూపాయలను బ్యాంకుల వడ్డీలు, అసలు చెల్లింపులకే ఖర్చు చేశామని తెలిపారు. ఆర్థికంగా ఇన్ని చిక్కులున్నా, ఎక్కడా వెనకడుగు వేయకుండా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆరు నూరైనా సరే రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పునరుద్ఘాటించారు. రైతు రుణమాఫీ చేసిన తరహాలోనే సన్న వడ్లకు బోనస్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు భరోసాను నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులంతా వ్యవసాయాన్ని పండుగలా చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులను కోరారు.

అన్ని రంగాల్లో విధ్వంసం చేసిన బీఆర్‌ఎస్‌ : మంత్రి తుమ్మల 

గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో విధ్వంసం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన రైతు భరోసా సభలో మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హా మేరకు రూ.2 లక్షలలోపు రైతు రుణాలను మాఫీ చేశామని మంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. రైతు సమస్యలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ’కేసీఆర్‌ ఒక్క రైతుబంధు ఇచ్చి.. అన్నీ బంద్‌ ‌చేశారు’ అంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే పలు వ్యవసాయ పథకాలను కూడా అప్పటి ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపివేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రస్తుతం ధాన్యం ఉత్పత్తి, ధాన్యం సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆయిల్‌పామ్‌ ‌సాగులో కూడా తెలంగాణను దేశంలో నంబర్‌వన్‌ ‌రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు ఎరువుల పంపిణీ, వ్యవసాయ సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌ ‌మంచి ఫలితాలు ఇస్తోందని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా యాప్‌ను తీసుకొస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *