– కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారాలు బంద్ చేయాలి
– రెండున్నరేళ్ల పాలనలో మారని రైతుల రాత
– మిల్లులు, దళారీల చేతుల్లో నలిగిపోతున్న రైతులు
– ఉచిత బియ్యం వ్యయంలో 72% పైగా భరిస్తున్న కేంద్రం-
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర మే 30 : రాష్ట్రంలో ‘మార్పు’ పేరుతో ఎన్నో ఆశలు, అబ్బురపరిచే హామీలు ఇచ్చి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్నా రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే రైతులు ఐకేపీ అధికారులు, ఇటు రైస్ మిల్లర్లు, దళారీల మధ్య నలిగిపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, ముందస్తు ప్రణాళికా లోపం వల్ల చేతికొచ్చిన పంట అకాల వర్షాల బారినపడి తడిసిపోతుంటే.. మంత్రులు, పాలకులు మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ‘రైతుల గోస – బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టే వరకు కూడా కాంగ్రెస్ మంత్రులు కార్యాలయాల్లోనే పరిమితమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ధాన్యం కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు విమర్శలు చేస్తున్నారు. అయితే ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణ, కొనుగోళ్లు, రైస్ మిల్లులకు తరలింపు వంటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపాలి. మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందించాలన్నారు. ప్రతి పంట సీజన్‌కు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమై ఉత్పత్తి అంచనాలు, కొనుగోలు పరిమాణం, నిల్వ సదుపాయాలు, వ్యయభారం తదితర అంశాలపై చర్చించి లక్ష్యాలను నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సమావేశాల్లో ఈ లక్ష్యాలకు అంగీకరించింది.
కేంద్రంపై నెపం మోపడం దారుణం
ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణ, కొనుగోళ్లు, గన్నీ బ్యాగుల సరఫరా, రైస్ మిల్లులకు తరలింపు వంటి ప్రాథమిక బాధ్యతలన్నీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్రం ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపితే.. మిల్లులు వాటిని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందించాలి. ఈ కనీస బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమై, కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపడం హాస్యాస్పదమని బీజేపీ నేతలు విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు కేవలం తప్పుడు ప్రచారాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.
దొడ్డు బియ్యం రైతులపై వివక్ష
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నబియ్యం సేకరణపైనే శ్రద్ధ పెడుతూ, దొడ్డుబియ్యం పండిస్తున్న రైతులను గాలికొదిలేసిందని, గతంలో తమిళనాడు, కేరళ, బిహార్ వంటి రాష్ట్రాలు దొడ్డుబియ్యాన్ని కొనుగోలు చేసేవని కానీ ఇప్పుడు అక్కడ కూడా ఉత్పత్తి పెరిగింది. మారుతున్న మార్కెట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయలేదన్నారు. మార్కెట్ యార్డుల్లో గన్నీ సంచుల కొరత, రవాణా జాప్యం కారణంగా రైతులు 20 నుండి 40 రోజుల పాటు పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు మద్దతు ధర ఇవ్వకుండా.. క్వింటాల్ వడ్లను కేవలం రూ. 1,700లకే కొంటూ రైతుల పొట్ట కొడుతున్నారని, ఈ ద దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6 ఎంఎం నుండి 6.5 ఎంఎం పొడవు గల నాణ్యమైన బియ్యానికి (యూరప్, అమెరికా, అరబ్ దేశాల్లో) భారీ డిమాండ్ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్గానిక్ వ్యవసాయాన్ని, తక్కువ పెస్టిసైడ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రైతులకు అటువంటి కొత్త వంగడాల విత్తనాలు అందించడంలో, గ్లోబల్ మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతుల అవసరాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూవ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





