– కాంగ్రెస్‌ది రైతు వ్యతిరేక, విశ్వాస ఘాతుక ప్రభుత్వం
– రాహుల్ జన్మదినం రోజే రైతు డిక్లరేషన్‌కు చెల్లుచీటీ
– రైతులపై విషం కక్కిన సిఎం రేవంత్ రెడ్డి
– రెండు బస్తాల యూరియాతో మిర్చి రైతులు ఏం కాను?
– మీడియా సమావేశంలో ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 19: కేంద్రం కనీస మద్దతు ధర నిర్ణయించిన పంటలను మాత్రమే కొంటామంటే ఇక మీరెందుకని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. పేపర్ లెస్ కేబినెట్ అన్నారని.. కానీ మీది విశ్వాసం లేని కేబినెట్, విశ్వాసఘాతుక ప్రభుత్వమని రేవంత్ రెడ్డి సర్కారుపై నిప్పులు చెరిగారు. పంట కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన జన్మదినం రోజే ఆ డిక్లరేషన్‌ను సీఎం బొందపెట్టారని విమర్శించారు. ధాన్యం ఏదైనా కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తామని నాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ అందుకు భిన్నంగా కేంద్రం చెప్పిందే కొంటాం.. ఎంత కొనమంటే అంతే కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారని తెలిపారు. తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కొన్నా కొనకపోయినా అన్ని పంటలు కొన్నది కేసీఆర్ ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన నిర్ణయం మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కేంద్రం ఎంఎస్‌పి ప్రకటిస్తుంది తప్ప మక్కలూ, జొన్నలు కొనదా అని అసహనం వ్యక్తం చేశారు. పప్పు దినుసులు, వేరుశనగ 25 శాతం మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. అంటే మిగతా పంటను రైతులు బయట అమ్ముకోవాలా అని నిలదీశారు. దళారుల దయాదక్షిణ్యంపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కొంటుందని, మిగతా పంటను రైతులు ఏం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటున్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తుందా అని అడిగారు. తడి గుడ్డతో రైతుల గొంతును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోస్తుందన్నారు. రైతులు జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయన్నారు. ఎకరాకు రెండు బస్తాల యూరియా మాత్రమే.. అదీ నెలకు ఒకటి చొప్పున ఇస్తారట అంటూ ఆయన ఆందోళన చెందారు. రైతులంటే ఎందుకు ఇంత చిన్నచూపు అని మంత్రులను ఆయన ప్రశ్నించారు. యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మిర్చి రైతులు ఎకరాకు ఐదారు యూరియా బస్తాలు వాడతారని, మరి మీరు రెండే ఇస్తే మిగతాది ఎట్లా అని ప్రశ్నించారు. కేంద్రం 30 శాతం యూరియా ధరలు పెంచిందని వివరించారు. రెండు బస్తాల ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. 45 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు బంధు ఇస్తామన్నారని, 90 రోజులు అయ్యిందని, ఇప్పటికీ రైతుల ఖాతాల్లో నగదు మొత్తం పడలేదని విమర్శించారు. ఎకరాకు రూ.15 వేలు అన్నారని చెప్పారు. 2024-25 వానాకాలం పంటకు ఒక్క రూపాయి ఇవ్వలేదని.. పూర్తిగా ఎగ్గొట్టారని తెలిపారు. రైతుబంధు కింద కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 5 పంటలకు రైతులకు రూ.29,358 కోట్లు బకాయి పడ్డిందని అన్నారు. రైతు బీమా ఆగలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పారని గుర్తు చేశారు. మరి ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు రైతు బీమా ఆగిందా? లేదా చెప్పాలని మంత్రులను ఆయన ప్రశ్నించారు. దీనిపై చర్చకు ఏ ఊరుకైనా పోదాం వస్తారా అని మంత్రులకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో 7,600 మందికి బీమా రాలేదని గణాంకాలతో హరీష్ రావు వివరించారు. ఎందుకు బీమా రావడం లేదంటే ప్రభుత్వం ప్రీమియం కట్టలేదన్నారని చెప్పారు. గురువారం మీరు కేబినెట్‌లో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని పంటలు యథావిధిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని రేవంత్ సర్కార్‌ను హరీష్ రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




