– 285 గ్రామాల్లో సర్వే పూర్తి
– అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ
– నవంబర్ చివరినాటికి మొదటి దశ పూర్తికి సన్నాహాలు
– పాలేరు నియోజకవర్గంలో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ
– రెవెన్యూ అధికారుల సమీక్షలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీ సర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భూ సర్వే పురోగతిపై సచివాలయంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఉన్న 411 రోవర్లకు అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయన్నారు. ప్రజల సంతృప్తే ప్రాధాన్యంగా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలకు గాను తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకుని మొత్తం 2,720 గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుకు భూమి ఆస్తి మాత్రమే కాదని, అది అతని జీవనాధారమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబరుకు ప్రత్యేక భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత తీసుకురావడంతోపాటు తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు పరిష్కారం చూపడంలో సమగ్ర రీ సర్వే కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయని, కాలక్రమేణా భూముల విభజనలు, సర్వే నంబర్ల ఉప విభాగాలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకోవడం వంటి కారణాలతో భూముల అసలు హద్దులపై స్పష్టత కొరవడిందని అన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర రీ సర్వే చేపడుతున్నట్లు వివరించారు. గతంలో భూముల కొలతలకు ఉపయోగించిన గొలుసులు, కర్రలు, క్రాస్స్టాఫ్, మెజరింగ్ టేపుల వంటి సంప్రదాయ పరికరాలకు స్వస్తి పలుకుతూ డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా భూముల కొలతల్లో కచ్చితత్వం పెరగడంతోపాటు సర్వే వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచి, భవిష్యత్తులో సరిహద్దులపై వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా భూదార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. డీజీపీఎస్ ద్వారా సేకరించిన సర్వే సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్లో నమోదు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 2 కోట్ల 29 లక్షలకు పెరిగిందని వివరించారు.
త్వరలో పాలేరులో భూదార్ పట్టాల పంపిణీ
రీ సర్వే ద్వారా ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక సర్వే పటాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత పెరగడంతోపాటు భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు వీలవుతుందన్నారు. తన సొంత నియోజకవర్గమైన పాలేరులోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో ఉన్న మొత్తం 665 ఎకరాల్లో వంద శాతం రీ సర్వేను విజయవంతంగా పూర్తిచేశామని, త్వరలో భూదార్ పట్టాలు పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. భూ రీసర్వేలో అధికారులు తప్పనిసరిగా అనుసరించాల్సిన విధానాలపై మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు వెళ్లే ముందు సంబంధిత పట్టాదారులకు విధిగా ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించారు. ముందుగానే తెలియజేయడం ద్వారా భూ యజమానులు అందుబాటులో ఉండేలా తమ భూముల హద్దులను నిర్ధారించుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. సర్వేకు ఒకటి రెండు రోజుల ముందు ఆయా గ్రామాల్లో తప్పనిసరిగా చాటింపు వేయాలని ఆయన సూచించారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములకు స్పష్టమైన మార్కింగ్ చేయాలని, గ్రామకంఠం హద్దులను నిర్ధారించిన తర్వాతే సర్వే చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, గ్రామకంఠం పరిధుల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా స్పష్టత తీసుకురావాలని సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానుల అభ్యంతరాలను నిబంధనల ప్రకారం స్వీకరించి పరిశీలించి పరిష్కరించాలని మంత్రి తెలిపారు. సర్వే ప్రక్రియలో పారదర్శకతకు పెద్ద పీట వేయాలని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ రీ సర్వేను అధికారులు ప్రభుత్వ విధిగా భావించకుండా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక బాధ్యతగా గుర్తించాలని మంత్రి పొంగులేటి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





