– హైదరాబాద్ కాలుష్యం నివారించేందుకే వనమహోత్సవం
– ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన కొనసాగుతుంది
– మూసీ మురికి కన్నా కల్వకుంట్ల విషం ప్రమాదం
– గుర్రంగూడ ఎకో పార్క్‌లో వనమహోత్సవం
– మొక్కను నాటి ప్రసంగించిన సిఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 18: 
కాలుష్య కోరల్లో చిక్కుకుని దిల్లీ ప్రజలు బాధపడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. మన హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రావద్దనే మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే కొందరు అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. మూసీ ఒడ్డున నివసిస్తున్న ప్రజలను తరలించి.. అభివృద్ధి చేస్తామంటే కొందరు మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ కడతామంటే మళ్లీ ఫార్మా కంపెనీలు తెస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ లేనివాళ్లు ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. ముందు సిద్దిపేట గెలిచిరండి.. ఆ తర్వాత రద్దుపై మాట్లాడదామని హితవు పలికారు. 60 శాతం గ్రీనరీ పెంచుతామంటే కేసులు వేశారని రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి. మేర ఈ పనులు చేపడతామని చెప్పారు. సబర్మతి, గంగా రివర్‌ఫ్రంట్‌ల కంటే మెరుగ్గా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. కాలుష్య రహిత వాతావరణం ప్రజలకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. నగర అవసరాల కోసం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ లేని నేతలు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెబుతున్నారు. వాళ్ల ఫ్యూచర్‌ను ప్రజలు నిర్ణయిస్తే.. ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తానన్న ఆయన ఈసారి సిద్దిపేటలో గెలవరు. కొందరు ఎన్జీటీలో కేసులు వేస్తున్నారు. మూసీలో కాలుష్యం కంటే కల్వకుంట్ల వాళ్ల కడుపులో కాలుష్యమే ఎక్కువ. ఎవరు అడ్డుపడినా అంతర్జాతీయస్థాయిలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించి తీరుతాం అని అన్నారు. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ్డుపడుతున్నారని.. మూసీలో ఉండే కాలుష్యం కంటే కల్వకుంట్లోళ్ల కడుపులో విషం ఎక్కువని అన్నారు. మూసీ పునరుజ్జీవం వద్దంటున్న సుధీర్ రెడ్డి గతంలో మూసీ కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. భూకబ్జాలతో ప్రజలకు సమస్య రావొద్దని హైడ్రా తెచ్చామని… హైడ్రాను భూతంలా చూపిస్తున్నారని మండిపడ్డారు.హైడ్రా పేదల జోలికి వెళ్ళదని.. కబ్జాదారుల భరతం పడుతుందని అన్నారు. దిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. మన హైదరాబాద్ కు ఆ పరిస్థితి రావొద్దని మొక్కల పెంపకం చేపట్టామని అన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17.66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునికీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ మధు యాష్కీ, అటవీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





