ప్రాణహితకు పునరుజ్జీవం

– తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల బ్యారేజీకి తెలంగాణ పట్టు
– 1న దిల్లీలో తెలంగాణ-మహారాష్ట్ర కీలక అంతర్రాష్ట్ర చర్చలు
– 152 మీటర్ల ఎత్తు సాధ్యమైతే గురుత్వాకర్షణతో సుందిళ్లకు దాదాపు 80 టీఎంసీలు
– భారీ ఎత్తిపోతల భారం తగ్గించి విద్యుత్ వ్యయానికి కళ్లెం వేసే దిశగా అడుగులు
– ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డిలో కోల్పోయిన ఆయకట్టుకు తిరిగి జల భరోసా
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి అసలు పథకంలో రాష్ట్ర రైతాంగానికి ఉద్దేశించిన సాగునీటి ప్రయోజనాలను తిరిగి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహితపై 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు 80 టీఎంసీల ప్రాణహిత జలాలను భారీ ఎత్తిపోతల అవసరం లేకుండా సహజ గురుత్వాకర్షణ ద్వారా సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 1న దిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య జరగనున్న కీలక అంతర్రాష్ట్ర చర్చల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో శనివారం సాయంత్రం ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. దిల్లీ సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన సాంకేతిక, న్యాయపరమైన వాదనలు, 152 మీటర్ల బ్యారేజీ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, మహారాష్ట్రలో ముంపు ప్రభావం, గురుత్వాకర్షణ ద్వారా నీటి తరలింపు సాధ్యాసాధ్యాలను కూలంకషంగా సమీక్షించారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల ఉన్నతాధికారులతోపాటు సీడబ్ల్యూసీలోని కీలక డైరెక్టరేట్ల అధిపతులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, అంతర్రాష్ట్ర అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య అధికారిక చర్చల ప్రక్రియ ప్రారంభం కావడమే ప్రాణహిత పునరుజ్జీవంలో కీలక ముందడుగని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖ కేంద్రంతో నిరంతరం జరిపిన సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాల ఫలితంగానే ఈ చర్చలకు మార్గం సుగమమైందన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం 2016లో అంగీకరించిన 148 మీటర్ల స్థాయికి బదులుగా 152 మీటర్ల స్థాయిలో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి పొందేందుకు తమ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నదని ఉత్తమ్ వెల్లడించారు. రెండు మీటర్ల అదనపుస్థాయి తెలంగాణకు జల వినియోగం, నీటి తరలింపు పరంగా గణనీయమైన సాంకేతిక ప్రయోజనాన్ని కల్పిస్తుందని వివరించారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించిన సాంకేతిక అధ్యయనాల ప్రకారం 148 మీటర్ల స్థాయిలో మహారాష్ట్ర భూభాగంలో సుమారు 1,150 ఎకరాలు, 152 మీటర్ల స్థాయిలో 2,500 ఎకరాలకు పైగా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. 148 మీటర్ల వద్ద కూడా ముంపు ఉంది. 152 మీటర్ల వద్ద కూడా ముంపు ఉంటుంది. ముంపు అంశంపై మహారాష్ట్రతో సంప్రదింపులు అనివార్యమైనప్పుడు రాష్ట్రానికి సాంకేతికంగా అత్యధిక ప్రయోజనం కలిగించే 152 మీటర్ల స్థాయికి సమ్మతి సాధించేందుకు గత ప్రభుత్వం మరింత సమర్థంగా చర్చించి ఉండాల్సింది. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను తగినంతగా పరిరక్షించకుండా 148 మీటర్లకు అంగీకరించడం వల్ల రాష్ట్రం ఒక కీలక అవకాశాన్ని కోల్పోయింది’ అని మంత్రి పేర్కొన్నారు. 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణం సాధ్యమైతే దాదాపు 80 టీఎంసీల ప్రాణహిత జలాలను సహజ గురుత్వాకర్షణతో సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. విద్యుత్ వినియోగం, ఏటా భరించాల్సిన నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ప్రాణహిత ప్రతిపాదనకు 1975, 1978 అంతర్రాష్ట్ర ఒప్పందాలు బలమైన న్యాయ, సంస్థాగత పునాదిగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుత ప్రయత్నం కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదని, దశాబ్దాల క్రితం ఏర్పడిన అంతర్రాష్ట్ర అవగాహనకు అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలను సాధించే ప్రయత్నమని వివరించారు. అసలు ఈ పథకం సుమారు 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూపుదిద్దుకుందని మంత్రి గుర్తు చేశారు. అనంతరం జరిగిన ప్రాజెక్టు  పునర్వ్యవస్థీకరణలో అసలు ప్రతిపాదిత ఆయకట్టులోని గణనీయమైన ప్రాంతాలు సాగునీటి ప్రయోజనాలకు దూరమయ్యాయని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లోని దాదాపు రెండు లక్షల ఎకరాలకు సమర్థమైన సాగునీటి వనరు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం దాటినా ‘ప్రాణహిత’ ద్వారా నీరందుతుందని ఆశించిన రైతుల నిరీక్షణ కొనసాగుతూనే ఉందన్నారు. ‘అసలు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని ఆశించిన రైతులు పదేళ్లకు పైగా ఎదురుచూశారు.. వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ప్రాణహిత పునరుజ్జీవం అంటే కేవలం ఒక బ్యారేజీ నిర్మించడం కాదు.. సాగునీటి హామీ కోల్పోయిన ప్రాంతాలకు తిరిగి జలభరోసా కల్పించడం’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలు కూడా అసలు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పునరాకల్పన చేసిన సమయంలో కీలక ప్యాకేజీలను తొలగించడంతో ఆయా ప్రాంతాలు తమకు ఉద్దేశించిన సాగునీటి వనరును కోల్పోయాయని తెలిపారు. అసలు ఆయకట్టులో ఉన్నప్పటికీ పునరాకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ప్రాంతాలకు తగిన జల భరోసా లభించలేదన్నారు. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వ ప్రాణహిత పునరుజ్జీవన ప్రణాళిక తుమ్మిడిహట్టి వద్ద ఒక బ్యారేజీ నిర్మాణానికే పరిమితం కాదని, పునరాకల్పనలో సాగునీటి ప్రయోజనాలు కోల్పోయిన ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి ప్రాంతాలకు అసలు ప్రాజెక్టులో కల్పించిన ప్రయోజనాలను తిరిగి అందించడమే విస్తృత లక్ష్యమని ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత.. మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరుపుతాం.. గరిష్ఠ ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ భారీ ఎత్తిపోతలపై ఆధారాన్ని తగ్గించి, రాష్ట్రంపై ఏటా పడే విద్యుత్ వ్యయభారాన్ని గణనీయంగా తగ్గించగల ప్రాణహిత ప్రాజెక్టును పునరుజ్జీవింపజేయడమే మా సంకల్పం.. రాష్ట్ర రైతాంగానికి ఒకప్పుడు ఇచ్చిన జల హామీని కార్యరూపంలోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *