– రూ.100 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ
– లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో వైభవంగా భూమి పూజ నిర్వహించారు. ఉదయం 8:50 గంటలకు హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేరుగా టెంపుల్ సిటీలో రూ.43 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాల శంకుస్థాపనలో కంచి కామకోటి పీఠాధిపతితో కలిసి వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ సీఎం రేవంత్ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.
శంకుస్థాపనల వివరాలు 
టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి, కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి, వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పై కప్పు నిర్మాణానికి, రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి, డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక శాలలతోపాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణం, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ.9.87 కోట్లతో భారీ కల్యాణ మండపం, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ.1.41 కోట్లతో రక్షణ పైకప్పు (కానోపీ) నిర్మాణం, రథశాల వైపు వాయువ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ.1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కొండపైకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భవానీశంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తిలు సీఎం, మంత్రులకు స్వామి వారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎస్సీ-ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్, దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ధార్మిక సలహాదారు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





