హింసను ప్రేరేపిస్తున్న సీఎం రేవంత్

– ఆయనపై డీజీపీ కేసు నమోదు చేయాలి
– కాంగ్రెస్ నేత రూ.20 లక్షలు తీసుకుని కాపాడినందునే షాబాద్‌లో నరమేధం
– కమీషన్ల కక్కుర్తితో బసవేశ్వర ప్రాజెక్టు బంద్
– త్వరలో బసవేశ్వర విగ్రహం నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్ర
– నారాయణఖేడ్ బీఆ ర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు ఫైర్

నారాయణఖేడ్, ప్రజాతంత్ర, జూలై 13 : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, రాజకీయ కక్ష సాధింపులకు, ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను వాడుకుంటున్నారు తప్ప ప్రజల రక్షణ కోసం కాదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ధ్వజమెత్తారు. నారాయణఖేడ్‌లో సోమవారం జరిగిన బీఆరఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, సభ్యత్వ నమోదు, ‘సర’పై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలను, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు. బీఆర్‌ఎస్ కార్యకర్త ఒక చిన్న పోస్టు పెడితే నిమిషాల్లో వెళ్లి అరెస్టు చేసే పోలీసులు మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన రాజ్‌కుమార్‌ను 40 రోజుల వరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్లు కాంగ్రెస్ నేతల సెటిల్మెంట్ కేంద్రాలుగా మారాయన్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు తీసుకుని, పోక్సో కేసు నుండి ఆ రేపిస్టును కాపాడాడని, పోలీసులకు 45 రోజులు టైం ఇచ్చి బెయిల్ ఇప్పించాడని ఆరోపించారు. దాంతో వాడు బయటకు వచ్చి ఏకంగా ఆరుగురిని కిరాతకంగా ఊచకోత కోశాడన్నారు. ఈ సైకో వ్యవహారంపై పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించి మాట్లాడుతున్నారు కానీ మన సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. కరవు పరిస్థితులపై విలేకరులు ప్రశ్నిస్తే మీ పీకలు కోసి రక్తం చల్లితే వానలు పడతాయి అని మాట్లాడుతున్నాడు.. ఈ సైకో రాజ్‌కుమార్‌కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేడా ఉందా.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా ఇది అని నిలదీశారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిపై డీజీపీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని అడిగారు. పోలీసులు కండ్లు మూసుకున్నారా.. చట్టం సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా ఒక్కటే అంటూ రేవంత్‌పై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒకపక్క కరువు వస్తుంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండయ్యా అని అడిగితే మీ పీకలు నొక్కుతా అంటున్నాడు. రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని సలహా ఇస్తే వాళ్లను జైల్లో పెడతా అంటున్నాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని అని అన్నారు. రిపేర్లు చేస్తామని సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయించారు. వానాకాలం వచ్చినా 30 పైసల పని కూడా జరగలేదు.. ఉన్న నీళ్లు వృథాగా పోయాయి.. ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రతి గింజా కొంటాం, అన్నింటికీ బోనస్ ఇస్తాం అని ప్రగల్భాలు పలికి ఇప్పుడేమో కేంద్రం ఏది కొనమంటే అదే కొంటాం, ఎంత కొనుమంటే అంతే కొంటాం అంటూ చేతులెత్తేశారని విమర్శించారు. 20% ప్రభుత్వం కొంటే మిగతాది రైతులు బయట అమ్ముకుని నష్టపోవాలా.. దిల్లీ చెప్పినట్లే వినడానికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు 8 గంటలకు పడిపోయింది. రుణ మాఫీ పేరుతో దేవుళ్ల మీద ఒట్లు వేసి తీరా గెలిచాక దేవుళ్లకే శఠగోపం పెట్టారన్నారు. కౌలు రైతులకు రైతుబంధు, 30 నెలల్లో రైతులకు రూ.19 వేల కోట్ల రైతుబంధు ఎగవేశారు.. ఎలఐసీకి ప్రీమియం కట్టకుండా రైతు బీమా ఆపేశారు అని తెలిపారు. డబ్బులు లేవని చెప్పే రేవంత్ రెడ్డి తన మనవడి కోసం ఫుట్‌బాల్ మ్యాచ్ పెట్టి రూ.వందల కోట్లు వృథా చేశాడన్నారు. మూసీ సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి లక్షల కోట్లు ఎక్కడినుంచి తెస్తున్నాడు. అందాల పోటీలకు వందల కోట్లు ఎక్కడివి అని అడిగారు. బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదు.. సీఎం కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల పాఠశాలల పిల్లలు అవస్థలు పడుతున్నారు. 20 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ పెట్టి వారి బతుకులను ఆగం చేస్తున్నాడని విమర్శించారు.

కేసీఆర్ పథకాలన్నీ బంద్

ఏ స్కీం ఆగలేదు అంటున్న రేవంత్ రెడ్డి గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, కేసీఆర్ కిట్, రైతుబీమా అన్నీ బంద్ పెట్టాడు. కేసీఆర్ మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నీళ్లు ఇస్తే నేడు నారాయణఖేడ్‌లో మూడు రోజులకో£సారి నల్లా వస్తోంది. నారాయణఖేడ్, ఆందోల్ ప్రజల సాగునీటి కోసం కేసీఆర్ సంగమేశ్వర- బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే రేవంత్ ఆ పనులను బంద్ పెట్టించాడు. మూసీ ముద్దు.. బసవేశ్వర వద్దా రేవంత్ రెడ్డీ అని ప్రశ్నించారు. ఈ జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు.. ఇక్కడి ఎమ్మెల్యే ఎందుకు అడగటం లేదు అని ప్రశ్నించారు. బసవేశ్వరుని స్ఫూర్తితో నారాయణఖేడ్‌లోని బసవేశ్వర విగ్రహం నుండి సంగమేశ్వర ప్రాజెక్టు వరకు త్వరలోనే పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఈసారి మెదక్ జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్‌వే అని ఆశాభావం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *