– లేకపోతే కాంగ్రెస్‌కు భారీ మూల్యం తప్పదు
– 20న విద్యార్థుల మిలియన్ మార్చ్ కు పిలుపు
– అఖిలపక్షం, బీసీ సంఘాల నాయకులు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య –భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, టీజేఎస్ నేత నిజ్జన రమేష్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వం కావాలనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలును నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫీజుల బకాయిల కారణంగా వేలాది మంది పేద విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రవేశాల్లో పాల్గొనలేకపోయారని, ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల హక్కుల కోసం ఈ నెల 20న హైదరాబాద్‌లో విద్యార్థుల మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి ఉన్నత విద్య కీలకమని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెం ట్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత విద్య పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధన కోసం చేపట్టే ఉద్యమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎల్. రమణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఇతర ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. 10న వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టనున్న విద్యాసంస్థల బంద్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడడం సరికాదని అన్నారు. బీసీ విద్యార్థుల ఉద్యమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాలు, మహిళా, యువజన, మేధావుల సంఘాల ప్రతినిధులు పాల్గొని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహ నాయక్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ రమేష్, కౌలే జగన్నాథం, వరుణ్ కుమార్, నాయకులు సత్యరాజ్ గౌడ్ గౌతమి, దేవిక, ఇంద్రమ్ రజక, మీసాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





