– ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నదని గుర్తు చేశారు.
మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోవడం ఎంతటి బాధో మాటల్లో చెప్పలేం.. వారి కుటుంబానికి ఈ దుఃఖ సమయంలో ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది అని తెలిపారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ సోదరులు ఆవేశానికి లోనవ్వకుండా ముందుకు సాగాలని కోరారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మరిన్ని కుటుంబాలను బాధలోకి నెట్టకూడదు.. మీ సమస్యలు మా సమస్యలే.. మీ బాధ మా బాధే.. ఆర్టీసీ కుటుంబం సురక్షితంగా, బలంగా ఉండాలని తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చల ద్వారా శాశ్వత మార్గం కనుగొనేందుకు సిద్ధంగా ఉంది.. ఈ క్లిష్ట సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి.. ప్రభుత్వం మీతోనే ఉంది అని సీతక్క స్పష్టం చేశారు.
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సంతాపం
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మరణించడం పట్ల బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ సంతాపం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ఆమోదించాలని సమ్మె చేస్తున్న తరుణంలో నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ తన ప్రాణాలను కోల్పోవడం విషాదకరం. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. శోకంలో మునిగిన ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని పార్థిస్తున్నానన్నారు. ఎవరూ ఈ రకమైన చర్యలకు పాల్పడి తమ కుటుంబాలకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. శంకర్‌గౌడ్ మృతి వార్త తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ ద్వారా చర్చలు జరుపుతోందని, వారి డిమాండ్‌లను పరిష్కరించడానికి ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నానన్నారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవడానికి ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇతర చర్యలను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకT మంత్రి పొన్నం పరామర్శ
అంతకుముందు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శంకర్‌గౌడ్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చూసి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి అండగా ఉంటామన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆర్టీసీ కార్మికులు మా కుటుంబ సభ్యులే.. మేమూ కిందిస్థాయి కార్మికవర్గం నుండి వచ్చిన వాళ్ళమే. కార్మికులకు అండగా ఉంటాం అని తెలిపారు. గతంలో సమ్మెలు జరిగితే పదుల సంఖ్యలో చనిపోయినా ఏ ఒక్క మంత్రీ వచ్చి కనీసం చూసి కూడా పోలేదన్నారు. కార్మికుల పట్ల తమ ప్రభుత్వానికి బాధ్యత ఉందని, వాళ్ళు తమ సోదరులు.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




