-బమ్మిడి జగదీశ్వరరావు

నాకు అద్దం అంటే యిష్టం!

అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. చూసే కొద్దీ చూడబుద్ధయింది. అందంగా వున్నాననీ అనిపించింది. నవ్వుకున్నాను. అద్దంలోని నా ప్రతిబింబమూ నవ్వింది.

నేను నవ్వు ఆపితే నా ప్రతిబింబమూ నవ్వడం ఆపేసింది.

నేను సీరియస్సుగా చూశాను. నా ప్రతిబింబం కూడా అంతే సీరియస్సుగా చూసింది.

నేను కన్ను గీటితే తను కూడా!

నే యేడుపు ముఖం పెడితే నా ప్రతిబింబమూ యేడుపు ముఖం పెట్టింది.

‘నువ్వెవరు? అచ్చం నాలానే వున్నావ్?’ అన్నాను.

‘నువ్వెవరు? అచ్చం నాలానే వున్నావ్?’ అని అనలేదు?! తిరిగి ‘నువ్వే నేను కదా?’ అంది. ‘అద్దం అబద్దం చెప్పదు’ అన్నాను. ‘అన్నీ కూడా చెప్పదు’ అంది అద్దం. అదే అద్దంలోని లోని నా ప్రతిబింబం.

ఊ…’ ఆలోచనలో పడ్డాను. ‘నేనెంత అందంగా వున్నాను’ జుట్టు సవరించుకుంటూ అనుకున్నాను. లేదు, అన్నాను. ‘నీ అందం నీది కాదు’ అంది అద్దం. విస్తుపోయి ‘మరి?’ యెవరిది అన్నట్టు చూశాను. ‘నీ యవ్వనానిది’ చెప్పింది అద్దం. ‘అంటే, వృద్ధాప్యంలో బాగోననా?’ అనుమానంగా చూశాను. ‘అందమైనా అనాకారితనమైనా యే దశలోది ఆ దశలోదే’ అంది అద్దం. ఆ రెంటినీ సమానంగా చూస్తోందేమో?!

అద్దం నాతో మాట్లాడుతోందా? నాలోనే నేను మాట్లాడుతున్నానా?

నేను ఆలోచనలో పడ్డాను. ఆ ఫీలింగ్ నా ముఖంలో చూపించలేదు. చిత్రంగా అద్దంలో కూడా నేను ఆలోచనల్లో వున్నట్టు కనిపించలేదు.

‘అద్దం అన్నీ చెప్పదు’ అని గుర్తొచ్చింది. మరేం చెపుతుంది? ఏమి చూపిస్తుంది?

పైకి కనిపించేది మాత్రమే చూపిస్తుంది! అద్దం యెందుకిష్టమో అప్పుడు నాకు బోధపడింది!

విచిత్రంగా అద్దంలో నా ప్రతిబింబం నేను నవ్వకుండానే నవ్వింది!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *