-పి. అమరజ్యోతి
కళ్యాణి కుంజ కవితాసంపుటి ‘కంకపొద’ గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించుకుంటున్నాం. ఆదివాసి బిడ్డగా గర్వంగా తననుతాను ప్రకటించుకున్న కళ్యాణి కుంజ ఆలోచనలు అరవై అయిదు కవితలుగా కంకపొదగా దట్టంగా మొలిచాయి. కుదురైన కవిత్వసంపుటిగా కనువిందు చేసింది. పాఠకుల మనసులనూ మెలితిప్పింది. “కవిత్వం ఆమెకు బతుకుపోడు సాగు” అంటూ ముందుమాట రాసిన ఎ.కె. ప్రభాకర్ అంటారిలా ‘అడవిబిడ్డ కుంజ కళ్యాణి ఆదివాసీ కోయకవిత్వం గురించి మాట్లాడాలంటే ఆదివాసీ ప్రాకృతిక జీవితం గురించి వారి జీవన తాత్వికత గురించి తెలిసి వుండాలి. విత్తు నాటినా, విత్తు మొలకెత్తినా మొగ్గ తొడిగినా పూత పూసినా కాయ కాసినా కోత కోసినా పండగ చేసుకొనే కోయ జన జీవన సంస్కృతి తెలిసి వుండాలి. సమ్మక్క సారాలమ్మ పగిడిద్ద రాజుల సాహసం తెలియాలి. జంపన్న వాగులోతు తాకి రాగలగాలి. పడిగెల్లోని ప్రతీకల వెనుక దాగి వున్న చరిత్రని అధ్యయనం చేయాలి. కోయ డోలీలు పుక్కిటపట్టి చెప్పే కథలసారాన్ని పట్టుకోవాలి’ అని.
ఇవేమాత్రం జీవితానుభవంలో లేని నాకు ప్రతీపనీ, ప్రతీపదం కొత్తగా అనిపించి ఏం చెప్పాలో తెలియనిస్థితి కానీ రచనలోని ప్రతిభావం మనసుకు తాకింది రచయిత్రి హృదయంలోకి నడిపించి అనుభూతి తెలిపింది, సారాంశం ఇంకింది, హృదయ భాషతో. ఆదివాసీ కవయిత్రి నుంచి తొలి తెలుగు కవితాసంపుటి ఈ “కంకపొద” అని తెలిసి ఆశ్చర్యం ఆనందం కలిగాయి. కవిత్వసంపుటి పేరు “కంకపొద” పెట్టడానికి అర్థంచెబుతూ రచయిత్రి కళ్యాణి “అడవిబిడ్డగా కంకపొదతో అవినాభావ సంబంధముంది. దానిలాగే గుంపుగా బతుకుతాం, బీదాబిక్కీ తేడాల్లేకుండా కలిమిలేముల బేధాల్లేకుండా కలుపుకొని బతుకుతాం. కంకరిల్లలు కొమ్మలన్నీ విడిపోకుండా ఒకదానితోనొకటి పెనవేసుకున్నట్లు మేమూ వుంటాం. ఏ చిన్నబంధాన్నీ వదులుకోం” అంటారు.

తమ జీవితాలతో ముడిపడివున్న “కంకపొద” పేరు పెట్టాననటం చక్కని ఎంపిక, ముచ్చట కలిగింది. కవితల్లో ఆకుపచ్చని అరణ్యాలను, పుట్టబోయే పిల్లలను కాపాడుకోవడం కోసం, నిరంతరం పోరాటం చేస్తున్న వీరుల్ని, దళారీరాజ్యంతో మడమతిప్పని యుద్ధం చేస్తున్నవారినీ చేర్చటం వారిపట్ల తనకున్న బాధ్యతనూ ప్రేమనూ తెలుపుతుంది. “పచ్చిపుండు సలుపు” కవితలో గర్భాన్ని దాల్చిన స్త్రీ వేదన ప్రసవవేదననూ ఎట్లా భరిస్తూందో “నీకేమైనా చాతనైతే చెప్పు చరిత్ర తిరగరాస్తా ప్రసవచారలు పరుచుకున్న దేహం అవి మాస్తాయంటే చెప్పు మళ్ళీ యౌవనినౌతా” అంటుంది. కవితలన్నీ ఆవేదనతో బరువెక్కిస్తాయి.
ఆదివాసీ కవితలో “నాగరికతను అభివృద్ధి చేసిన మాకు/ అనాగరిత్వాన్ని అంటగడతాండ్రు/ నిప్పును కనుగొని వండితినడం/ నేర్పిన మేము/ అందని అరకొర సౌకర్యాల/ ఆకలి నిప్పులో మాడిన నల్లని శవాలం” అంటుంది. ఆదివాసీ అనీ, కోయనీ, దొరసట్టం అనీ పిలుస్తారు మమ్మల్ని. మేమే తొట్టతొలి ఆదిమజాతివాళ్ళం. ప్రకృతితో మమేకమై ప్రకృతిని కాపాడుతూ అందులోనే బతుకు, అందులోనే చావంటూ తమ వునికినీ, ఆస్తిత్వాన్నీ చాటుతారు రచయిత్రి. దోడవేటలో గురితప్పని మా బాణాలు “నేర్పనివిద్యకు గురుదక్షిణ/ ఏకలవ్యుడి తెగిన బొటనవేళ్ళం” అంటూ ఆదివాసీ కవితలో తమజాతికి జరిగిన అన్యాయానికి ఆక్రోశం, ఉక్రోషం వెలిబుచ్చడంతో పాఠకుల మనసూ ఆవేదన చెందుతుంది.
బాల్యంలో చదువుకోసం పడిన కష్టాలు ఇష్టంగా భరిస్తూ ఆగిపోవాలని అడ్డంకులెదురైనప్పుడు మౌన పోరాటంతో ఎదిరించి నిలిచి పట్నంలో పట్టాతో ఉపాధినీ ఉద్యోగం సంపాదించి గెలవటం సామాన్యం కాదని తెలుస్తుంది. కవయిత్రిగా మారేక్రమంలో మార్గనిర్థేశకుల నుంచిమాట సలహా ఇచ్చేవారి వరకూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆవిధంగా ఆదివాసీ కవిత్వ పరిమళాలు కవిత్వ ప్రేమికులకు చేరాయి. అభినందనీయురాలు రచయిత్రి కుంజ కళ్యాణి మరిన్ని రచనలు చేయాలని ఆదివాసీల సామాజిక సమస్యలు పరిష్కారం దిశగా ఇంకా రాయాలని ఆశిస్తున్నాను. అందరికి అర్థం కాని చాలా పదాలకు అర్థంతో సహా తదుపరి ప్రచురణ రావాలని కవిత్వాభిమానుల కోరిక





