– ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా వ్యవహరించాలి
– విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : దేశ ప్రజల తరఫున, వారి ఓటు హక్కు రక్షణ కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. దిల్లీలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ప్రాథమిక ఓటు హక్కును కాలరాస్తోందని విమర్శించారు. ఎన్నికల ముంగిట వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమాలపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు మొదటినుంచీ ప్రశ్నిస్తున్నారని, అప్పట్లో వాటిని రాజకీయ విమర్శలుగా కొట్టిపారేసినా ఇప్పుడు ఎన్నికల సంఘం కమిషన్‌లోని కమిషనర్లే అంగీకరించడంతో ఆ ఆరోపణలు నిజమని రుజువయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ ప్రజల్లో ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయనే నమ్మకం సామాన్య ప్రజల్లో కూడా కలగాలంటే ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థను ఈ స్థాయికి దిగజార్చినందుకు బీజేపీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. నేడు దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం విశ్వసనీయతపైనే తీవ్ర చర్చ నడుస్తున్నందున ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యులు తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





