– ఏం పాపం చేశారని గాంధీ పేరు తొలగించారు
– యూపీఏ తెచ్చిన ‘ఎంజీ నరేగా’ ఓ నిశ్శబ్ద విప్లవం
– ఆ పథకాన్ని తిరిగి తెచ్చేవరకు కాంగ్రెస్ శ్రేణులు పోరాడతాయి
– చెన్నై బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చెన్నై, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మహాత్మా గాంధీ ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకం నుంచి ఆయన పేరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. చెన్నై నగరంలో ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్పు, ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి ఆ పథకం కనిపించకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాదు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ గ్యారంటీ కల్పించాలన్న ఆత్మను సైతం తొలగించారని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికులు ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకంలో బీజేపీ ప్రభుత్వం మార్పులు చేసిందని నిలదీశారు. ప్రతి వ్యవసాయ సీజన్‌లో 50 పైసల కూలి ధరల పెరుగుదల కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, పోలీసు లాఠీచార్జీలు, రక్తపాతం జరిగేవని భట్టి తెలిపారు. ఈ దారుణమైన పరిస్థితులను పారద్రోలాలన్న మానవీయ కోణంతో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం వంద రోజుల పని గ్యారంటీ కల్పిస్తూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం అని వర్ణించారు. ఈ పథకం వ్యవసాయ కార్మికుల జీవితాలకు ఓ అర్థం తీసుకొచ్చిందని, ఉన్న ఊరిలోనే సంపాదిస్తూ ఆత్మగౌరవంతో వ్యవసాయ కూలీలు జీవించేందుకు ఈ పథకం తోడ్పడిందని తెలిపారు. ఇంతటి గొప్ప పథకాన్ని కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకంలో అనేక మార్పులు తీసుకొచ్చిందని, చివరకు దేశ ప్రజలు మహాత్మునిగా పిలుచుకునే గాంధీ పేరును సైతం తొలగించిందని విమర్శించారు.
వ్యవసాయ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ కమిటీల ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2005ను బీజేపీ ప్రభుత్వం పునరుద్ధరించే వరకు వ్యవసాయ కార్మికుల పక్షాన దేశంలోని కోట్లాది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు వ్యవసాయ కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు. సామాన్యునికి ఇబ్బందులు వచ్చినప్పుడు తమిళనాడు ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలబడుతుందని, బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఉపాధి చట్టంతో వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఇబ్బందులు మొదలైన ఈ పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికుల పక్షాన తమిళనాడు ముందు వరుసలో నిలబడటం అభినందనీయమని అన్నారు. ఈరోజు చెన్నై నగరంలో జరుగుతున్న భారీ ర్యాలీని చూస్తే తనకు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయని విభట్టి అన్నారు. 1915లో తన న్యాయవాద వృత్తిని వదిలి సహచరులతో కలిసి దేశ స్వాతంత్య్రంం కోసం గొప్ప పోరాటం నిర్వహించాలనే పట్టుదలతో దక్షిణ ఆఫ్రికా నుంచి దేశానికి మహాత్మా గాంధీ వచ్చారని గుర్తు చేశారు. గాంధీజీ మనకు స్వేచ్ఛను ఇచ్చారు.. పెరియార్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు.. కామరాజు నిజాఅతీని ఇచ్చారు.. అన్నాదురై గౌరవాన్ని ఇచ్చారు.. ఈ వారసత్వానికి తగిన భవిష్యత్తును మన బిడ్డలకు ఇవ్వాలి.. అదే కాంగ్రెస్ లక్ష్యం.. నైతిక కర్తవ్యం.. చరిత్రాత్మక బాధ్యత అని డిప్యూటీ సీఎం తెలిపారు. సభలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు సెల్వం, ఏఐసిసి సెక్రటరీ చోలాంకర్ జి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





