మైనార్టీలతో కలిసి దేశం అభివృద్ధి చెందాలి

– జమీయత్ ఉలమా సభలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: జమీయత్ ఉలమా దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని, దేశంలో మైనార్టీలు-మెజారిటీలు కలిసే ముందుకు వెళ్లేలా జమీయత్ ఉలమా యే హింద్ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు. జమీయత్ ఉలమా యే హింద్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు జమీయత్ సంస్థ స్వచ్ఛందంగా సహకరించిందని గుర్తు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన రాజకీయ ప్రయాణంలో జమీయత్ ఉలమా యే హింద్ మద్దతు కీలకంగా నిలిచిందని తెలిపారు. హిందువులతో పాటు ముస్లింలు తనను గెలిపించి పార్లమెంట్ కు పంపారని అన్నారు. లోక్సభలో రాహుల్ గాంధీకి తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల విధానాలపై పోరాటం చేశామని సీఎం వెల్లడించారు. మైనార్టీల అండతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా షోయబుల్లా ఖాన్ వంటి నాయకులు పోరాటం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనార్టీలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందని, సల్మాన్ ఖుర్షిద్, అహ్మద్ పటేల్ వంటి నేతలు కాంగ్రెస్లో అగ్రస్థానాలకు ఎదిగారని తెలిపారు. రాష్ట్రంలో అజారుద్దీన్, షబీర్ అలీ వంటి మైనార్టీ నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని, అవకాశం ఉన్న ప్రతిచోటా మైనార్టీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఎనిమిది కార్పొరేషన్లకు మైనార్టీలకు బాధ్యతలు అప్పగించామని, అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిగా నియమించామని గుర్తు చేశారు. పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు గెలిపించుకునే బాధ్యత కార్యకర్తలపై ఉంటుందని, రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేందుకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకు రాబోతున్నామని సీఎం ప్రకటించారు. విద్వేష ప్రసంగాల నియంత్రణ అత్యవసరమని, దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి మెలిసి ముందుకు సాగాలని అన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతల పరిరక్షణ అవసరమని తెలిపారు. కులగణన సమయంలో రాష్ట్రంలోని మైనార్టీ జనాభాను కూడా లెక్కించామని, సుప్రీం కోర్టులో 4 శాతం రిజర్వేషన్ల కేసు విచారణకు వచ్చినప్పుడు ఈ గణాంకాలను సమర్పిస్తామని తెలిపారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల అనేక మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. మైనార్టీలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *