బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దోపిడీనే

– కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి
– కేటీఆర్ పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరు
– కాంగ్రెస్ కమిటీ బాధ్యతల స్వీకారంలో పీసీసీ చీఫ్

ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: బీఆరఎస్ నేతలు పదేళ్లపాటు దుర్మార్గమైన పరిపాలన చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటున్నారని, ఆయన పాదయాత్ర కాదు ఏం చేసినా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ని క్షమించరని హెచ్చరించారు. కేసీఆర్ అప్పులు చేసి ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పాదయాత్రకు ముందు చెల్లి కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఖమ్మంలో డీసీసీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల కేసీఆర్ హయాంలో ఏం చేశారని ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క లెక్కలతో సమాధానాలు అడుగుతుంటే కేసీఆర్ అండ్ కో సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేత సంతోశ్‌రావు ఎలా సంతోషంగా ఉన్నారో, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆనందం ఏంటో, దోపిడీ ఎంతో చెల్లెలు కవిత చెబుతోందని సెటైర్లు గుప్పించారు. పదేళ్లు దోపిడీకి అలవాటుపడి ప్రజల ఆగ్రహానికి గురై పదవులు కోల్పోయి నేడు విలవిలలాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ అండ్ కో పిచ్చిమాటలు మాట్లాడుతూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఎప్పుడూ అండగా నిలిచిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న పీవీ నరసింహా రావు దేశ ప్రధాని అయ్యారని, ఇది ఒక్క కాంగ్రెస్‌కే సాధ్యమని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలని మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతో నేడు అధికారంలోకి వచ్చామని, పార్టీలో సామాన్య కార్యకర్తలు కీలక పదవులు పొందారని చెప్పారు. భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయిందని ఉద్ఘాటించారు. ఖమ్మం గడ్డపై నిలబడి చెబుతున్నా.. వచ్చే ఎన్నికే కాదు.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌దే విజయమని అన్నారు. చేతనైతే తమ విజయాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్ విజయం ప్రారంభమైందని చెప్పారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్ తదితరులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *