ఉత్తరాది, దక్షిణాది అంటూ విభేదాలు

– ప్రజలను బంట్రోతులుగా చూస్తున్నారా?
– లక్ష్మణ్ వలసపోయారని విమర్శలా
– ఇందిర, రాహుల్, ప్రియాంక ఎక్కడి నుంచి వచ్చారు
– రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

న్యూదిల్లీ, ఏప్రిల్ 14: ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజన తీసుకొచ్చే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. బంట్రోతు పోస్ట్ దొరకదని అంటున్నారని.. ప్రజలను బంట్రోతులుగా చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు మాటలు మాట్లాడొద్దని, వాస్తవాలు మాట్లాడాలని, వితండవాదనలు పక్కన పెట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.   కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, తెలుగువారి ఆత్మగౌరవంగా టీడీపీ పుట్టిందని ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉప రాష్ట్రపతులుగా ఉన్నారని, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా పనిచేశారని గుర్తు చేశారు. తాను ఒక్కడినే మేధావిని అనుకుని అద్దాల మేడలో కూర్చుని సీఎం రేవంత్ రెడ్డి రాళ్లు వేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎక్కడినుంచి వచ్చారని ప్రశ్నించారు. దేశం మొత్తం ఒకటి కాదా అని ప్రశ్నించారు. లక్ష్మణ్ వలస పోయారని రేవంత్ రెడ్డి అంటున్నారని, మరి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేశారని కిషన్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ బుద్ధితో నడిపిస్తే రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు అధికారికంగా కోశాధికారిగా పనిచేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. డీలిమిటేషన్‌తో ఎన్ని సీట్లు పెరుగుతాయనేది పార్లమెంటుసమావేశాల్లో తెలుస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్, జీడీపీ పరంగా సీట్లు పెరగాలని అంటున్నారని, ప్రపంచలో ఇది ఎక్కడా లేదని అన్నారు. అలాంటప్పుడు అసెంబ్లీ సీట్లు ఆదిలాబాద్, ఖమ్మంలో తగ్గిస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. 70 శాతం రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తోందని, హైదరాబాద్‌లో మాత్రమే సీట్లు పెంచుతారా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. రాహుల్ గాంధీ తర్వాత అంతటి మేధావి రేవంత్ రెడ్డేనని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
——————————————————————————————————————————————————————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *