పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

– బీఆర్ ఎస్ మునిగిపోయే పడవ
– పదేళ్ల ఆ పార్టీ పాలనలో తెలంగాణ నలిగిపోయింది
– పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
– అభివృద్ధిలో వామపక్షాలు భాగస్వామ్యం కావాలి
– రెండేళ్ళలో అద్భుతమైన ప్రగతి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 120 పురపాలక సంఘాలు, ఏడు కార్పొరేషన్ లలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ మునిగిపోయే పడవ అని, ఆ పార్టీకీ వేసే ప్రతి ఓటు మురిగిపోతుందని, ప్రజలు ఇది గ్రహించాలని ఉద్బోధించారు. పురపాలక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజుర్‌నగర్, కోదాడ, నేîరేడుచర్ల పురపాలక సంఘాల పరిధిలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీతోపాటు పార్టీ బలపచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని లీడర్, కేడర్‌కు మార్గదర్శనం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదేళ్ల బీఆరఎస్ పాలనలో కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నలిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న జనాభాకనుగుణంగా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్ రూపొందించిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో మిత్రపక్షాలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న ప్రజాపాలనకు ప్రజామోదం లభించిందని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. అవే ఫలితాలు ఈ నెల 11న జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో కూడా ప్రతిబింబిస్తాయన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన అద్భుతమైన ప్రగతికి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆదరిస్తున్న ప్రజలు ఈ ఎన్నికలలో సుస్పష్టమైన తీర్పు నివ్వబోతున్నారన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయడం విప్లవాత్మకమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలకు సన్న బియ్యం పంపిణీ ఉచితంగా జరుగుతున్నదన్నారు. బీఆరఎస్ పాలనలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినడానికి ప్రజలు విముఖత చూపడంతో పక్కదారి పట్టాయన్నారు. ఆ మహత్తర కార్యక్రమాన్ని హుజుర్‌నగర్ నుండి ప్రారంభించుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు.

హుజుర్‌నగర్‌ను అగ్రస్థానంలో నిలబెడతా

రాష్ట్రంలోనే హుజుర్నగర్ నియోజకవర్గాన్ని అగ్రభాగంలో నిలబెడతానని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. పురపాలక సంఘ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నియోజకవర్గ కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల వ్యవధిలోనే హుజుర్‌నగర్‌లో అద్భుతమైన ప్రగతి సాదించామన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, మారుమూల ప్రాంతాలపై స్పష్టమైన అవగాహన ఉన్న తాను ప్రజల సేవకే అంకితభావంతో పని చేస్తున్నామన్నారు. రెండేళ్ల వ్యవధిలోనే హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జూనియర్, డిగ్రీ కళాశాలకు రూ.12 కోట్ల అంచనాతో ఆధునిక వసతులతో భవనాల నిర్మాణం, రూ.8 కోట్లతో రోడ్లు భవనాల భవనం, రూ.7 కోట్లతో నీటిపారుదల శాఖ‌ భవనం, ప్రభుత్వ హాస్పిట‌ల్‌లో డయాలసిస్ కేంద్రంతోపాటు కిడ్నీల స్కానింగ్ మిషన్ ఏర్పాటు, ఔట్ పేషంట్లకు నూతన భవన నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిలో భాగమేనన్నారు. డ్రైనేజీల నిర్మాణం అంతర్గత రహదారుల నిర్మాణం సాదించినవేనని తెలిపారు. అన్నింటికీ మించి వ్యవసాయ విద్యాలయం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి మార్క్‌కు నిదర్శనమన్నారు. పురపాలక సంఘం ఎన్నికల అనంతరం హుజుర్‌నగర్‌లో మటన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *