– విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామగ్రి అందాలి
– వస్తువుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు
– ప్రతీ విద్యార్థి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి
– సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందితే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపుతారని అన్నారు. విద్యా శాఖతో పాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లోని విద్యార్థులకు అందజేసే సామగ్రి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గతంలో దుస్తులు, నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ఇతర సామగ్రి సరఫరాకు సంబంధించి ఏ శాఖకు ఆ శాఖ చేపట్టడంతో అవకతవకలకు ఆస్కారం ఉండేదన్నారు. అటువంటి అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. వాటిని అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కాదని అన్నారు. విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ షూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగ్లు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్యమైనవే ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాణ్యతతోపాటు సకాలంలో అందడంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా అందాలని, అలా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అక్కడినుంచి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని, సరఫరాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయించాలన్నారు. ప్రతి విద్యార్థికి వారికి అవసరమైన సామగ్రి అంతా అందిందా లేదా అనే దానిని చెక్ చేసుకోవాలని సీఎం ఆదేశించారు. నోటు పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి క్వాలిటీ వాటిని అందుకున్న తర్వాత వారి భావాలను తెలియజేసేందుకు విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, సెర్ప్ సీఈవో దివ్య, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, టీజీ బీసీడబ్ల్యూఆరఐఈఎస్ కార్యదర్శి బి.సైదులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




