– మౌలిక సదుపాయాల ఏర్పాట్లు లేవు
– ధాన్యం కొనుగోలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 8 : తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దిల్లీలో విలేకరుల సమావేశంలో ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయన్నారు. గన్నీ బ్యాగులు, గోడౌన్లు లేవు.. రైసు మిల్లుల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళనలు వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారని తెలిపారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉద్యమం చేసిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. కేవలం ధాన్యాన్ని సేకరించడమే కాదు.. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐలకు చేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అన్ని రకాల ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమే డబ్బులు చెల్లిస్తోందన్నారు. 2024-25 ఖరీఫ్‌లో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, ఎఫ్‌సీఐకు జమ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కనీసం 13 శాతం కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. 2024-25 రబీ సీజన్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని, 2025-26 ఖరీఫ్‌కు సంబంధించి 45 శాతం బియ్యం ఎఫ్‌సీఐకి చేరలేదని, 25-26 రబీ సీజన్‌కు 90 శాతం బియ్యం పరిస్థితి ఇలాగే ఉందని వెల్లడించారు. గతంలో బీఆరఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడమే తప్ప కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్రం శ్రద్ధ చూపించలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తోందన్నారు. గత 12 ఏళ్లలో ధాన్యం కొనుగోలుకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.16 లక్షల కోట్లు రుణాలను అందజేసిందని, 2025-26లో ధాన్యం సేకరణ కోసం రూ.37 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ ద్వారా అందజేసిందని, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.22,700 కోట్లను మంజూరు చేసిందని వివరించారు. రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులను అందజేస్తోందని తెలిపారు. కానీ, రైతుల సమస్యలపై దిల్లీలో ధర్నా చేయాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారంటూ బీఆరఎస్, కాంగ్రెస్‌లు కలిసి ధర్నాకు వస్తే నిజాలేంటో మీకు తెలియజేస్తాం అన్నారు. గాలి మాటలు మాట్లాడటం బీఆరఎస్, కాంగ్రెస్‌లకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రాలకు నిధులు అందజేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి కానీ రైతుల ధాన్యం కొనుగోలు, గోడౌన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్ కోసం ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిందిపోయి అనవసరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సన్న బియ్యం ప్రతి కేజీలో 70% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. అంతకుముందు కిషన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్ర ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





