– ఇరాన్ తో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
– హర్మూజ్ పై సుంకాల విధింపునకు ఇరాన్ సమర్థన
– 40 రోజుల ఉద్రిక్తతల నుంచి ఉపశమనం
– ఫలించిన పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
వాషింగ్టన్, ఏప్రిల్ 8: పశ్చిమాసియాలో గత 40 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా`ఇరాన్ మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాలపాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ’ది ట్రూత’లో వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా ’ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు. ఇరాన్‌తోపాటు ఇతర దేశాలు కూడా శాంతిని కోరుకుంటున్నాయి. హర్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సహకరిస్తాం’ అని రాసుకొచ్చారు. అమెరికా సీజ్ ఫైర్ నిర్ణయానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలిపింది. లెబెనాన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినా హర్మూజ్ విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గటం లేదు. ఇప్పటికీ అది ఇరాన్ నియంత్రణలోనే ఉంది. హర్మూజ్‌లో నౌకల నుంచి ఇరాన్ భారీ మొత్తంలో టోల్ వసూలు చేస్తోంది. టోల్ ఆదాయాన్ని పునర్నిర్మాణానికి ఖర్చు చేస్తామంటోంది. పాకిస్థాన్ ప్రధాని సూచనల మేరకే గడువును పొడిగించినట్టు ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించడం వెనుక చైనా కీలక పాత్ర పోషించిందని వార్తలు వస్తున్నాయి. కాల్పుల విరమణపై చర్చలు జరపడానికి టెహ్రాన్‌ను ఒప్పించడంలో చైనా ప్రమేయం ఉందా అని విలేకరులు ప్రశ్నించినపుడు అవుననే అనుకుంటున్నా.. నేను కూడా విన్నా అని ట్రంప్ పేర్కొన్నారు. మే నెలలో చైనా పర్యటనకు ట్రంప్ వెళ్లబోతున్నారు. ఆ సమయం లోపునే ఈ యుద్ధం ముగియాలని చైనా భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టు వంటి మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌ను శాంతి మార్గం వైపు నడిపించడంలో చైనా నిశ్శబ్దంగా పనిచేసిందని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో బీజింగ్ పాత్రపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. నిజానికి ఈ యుద్ధం ఆగడం చైనాకు కూడా చాలా కీలకం. ఎందుకంటే చైనాకు ఇరాన్ ప్రధాన ఆయిల్ సరఫరాదారు. జలసంధిని మూసివేయడంతో చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చల విషయమై చైనా అధికారులు నేరుగా ఇరాన్ నాయకులతోనే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఏదేమైనా భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల్లో చైనా ప్రభావం మరింత పెరుగుతుందనేందుకు ఈ పరిణామం కీలక సంకేతం.
ఇదో గొప్ప సుదినమంటూ ట్రంప్ పోస్ట్
ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణకు జరిగిన ఒప్పందంపై ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ది ట్రూత’ పోస్టు చేశారు. ఇరాన్ ఇదే కోరుకుంటోందన్నారు. తాజా యుద్ధంలో ఇరాన్ చాలా దెబ్బతిన్నట్లు చెప్పారు. హర్మూజ్ జలసంధిలో మళ్లీ చమురు నౌకల సందడి పెరుగుతుందని, దీనికి అమెరికా సహకరిస్తుందని అన్నారు. చాలా పాజిటివ్ యాక్షన్ ఉండబోతోందన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తారని, ఇరాన్ మళ్లీ పునర్నిర్మాణ పనులు మొదలుపెడుతుందని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో స్వర్ణ యుగం ఉండబోతోందన్నారు. తనకు ఆ నమ్మకం ఉందంటూ రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని విక్టరీగా చెప్ప్పుకున్నారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇండోనేషియా స్వాగతించింది. ఇరు దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నది. దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి యెన్నె మివాంగ్‌కాంగ్ తెలిపారు.
కాల్పుల విరమణను స్వాగతించిన భారత విదేశాంగ శాఖ
న్యూదిల్లీ: ఇరాన్-అమెరికాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి కోసం ఉద్రిక్తతలను తగ్గించాలి, చర్చలు, దౌత్యం కోసం పిలుపునివ్వాలని సూచించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విమరణను మేము స్వాగతిస్తున్నాము. ఇది పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి దారితీస్తుందని ఆశిస్తున్నాము. మేము గతంలో, నిరంతరం స్పష్టం చేసినట్లుగా.. కొనసాగుతున్న సంఘర్షణలకు త్వరగా ముగింపు పలకడానికి ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం చాలా అవసరం అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ సంఘర్షణలతో ఇప్పటికే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రపంచ ఇంధర సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగించింది. హార్ముజ్ జలసంధి నుండి నిరాటంకమైన నౌకాయాన స్వేచ్ఛ, ప్రపంచ వాణిజ్య ప్రవాహం కొనసాగుతుందని మేము ఆశిస్తున్నామని తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





