– కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి, సీసీఐ సీఎండీలకు మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలంటూ వ్యవసాయ, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ కొత్త నిబంధన పత్తి రైతులకు చేటు తెచ్చేదిగా ఉందన్నారు. ఇప్పటివరకు ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారని,ఎకరాకు 11.74 క్వింటాళ్ల వరకు దిగుబడులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ల నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చిందని కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, సీసీఐ సీంఎడీ లలిత్‌కుమార్ గుప్తాలకు రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి రైతులకు నష్టం వాటిల్లగా ఇపుడు సీసీఐ కొత్త నిబంధన వారికి నష్టం చేసేదిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 శాతం వరకు తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని కోరారు. కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన లేక పత్తి రైతులకు ఇబ్బందులు తలెత్తాయని, రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తి వేసి పాత పద్ధతిలో పత్తి కొనుగోళ్లు చేయాలని, తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి తుమ్మల ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గోపి, డైరక్టర్ ఆఫ్ మార్కేటింగ్ లక్ష్మీబాయి, ఇతర అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





