నిర్లక్ష్యం.. ప్రాణాంతకం

– అప్రమత్తతతో అగ్నిప్రమాదాల నివారణ
– అడిషనల్ మహేష్ ఎం భగవత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాంతకమవుతుందని శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం డిజిపి కార్యాలయంలో అగ్నిమాపక శాఖ అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కంగారుపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే 101 నంబరుకు సమాచారం అందిస్తూనే మంటలు చెలరేగగానే భవనాన్ని తక్షణమే ఖాళీ చేయాలని, కిందకు రావడానికి లిఫ్టులు వాడకుండా మెట్ల మార్గాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ భవనంలో పొగ ఎక్కువగా వ్యాపిస్తే ఊపిరాడకపోయే ప్రమాదం ఉన్నపుడు నేల మీద పాకుతూ వెళ్లడం శ్రేయస్కరమని, ముక్కుకు తడిగుడ్డ కట్టుకుని సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని వివరించారు. ఒంటికి మంటలు అంటుకుంటే పరుగెత్తకుండా వెంటనే నేలపై పడుకుని దొర్లడం ద్వారా మంటలను అదుపు చేయవచ్చని, అలాగే పాఠశాలలు, హాస్పిటల్స్, బహుళ అంతస్తుల భవనాల్లో భద్రతపై ప్రతి పౌరుడూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా వంట గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు గానీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు గానీ ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అగ్గిమాపక శాఖ అధికారులు ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో పి అండ్ ఎలఐజిపి గజరావు భూపాల్, ఆరఎఫఓ హరిచంద్రారెడ్డి, డిఎఫఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *