చేవెళ్ల బస్సు ప్రమాదం దురదృస్టకరం

– మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా
– చేవెళ్ల హాస్పిటల్‌ వద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు
– హాస్పిటల్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర
– ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన వైద్యులు

– అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్‌

చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టిన దుర్ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర ఘటన.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం.. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం.. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నాం అని తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించి, మంత్రులు, అధికారులను అప్రమత్తం చేశారన్నారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాల్సిందిగా ఆదేశించారని, వాస్తవ పరిస్థితి, ప్రమాదం జరిగిన తీరును మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారన్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారంటూ సీఎస్‌, డీజీపీ మొదలు యావత్తు అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైందన్నారు. తనతోపాటు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ పీఎంఆర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించామన్నారు. సమాచారం అందగానే జిల్లా కలెక్టర్‌, పోలీస్‌, ఇతర విభాగాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై మార్గ నిర్దేశం చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ఈ అంశంపై సంబంధిత ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఇంత పెద్ద ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదు
చేవెళ్ల ఏరియా హాస్పిటల్‌ వద్ద మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి దానికీి రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు బాగా అలవాటుయింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు. దాన్ని మీ విచక్షణకే వదిలేస్తున్నాం. రోడ్డు విస్తరణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అలసత్వం లేదు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఈ రోడ్డు విస్తరణ పనులను కొందరు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేసి ఇన్ని రోజులలూ అడ్డుకున్నారు. ఆ విషయం తెలిసి కూడా ఇప్పుడు తమపై బురద జల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను ట్రిబ్యునల్‌ ముందు సమర్థవంతంగా వినిపించడంతో తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది. దీంతో ఈ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాం. 18 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అని మంత్రి చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఇప్పటికే మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించాం.. అలాగే శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించామని చెప్పారు.రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతిచెందడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదం పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు కేబినెట్‌ సహచరులు వెంటనే స్పందించి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని,. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను చేశెల్ల హాస్పిటల్‌ వద్ద ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వీలైనంత త్వరగా పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని డాక్టర్లను ఆదేశించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలి :మంత్రి పొంగులేటి

బస్సు ప్రమాదంపై రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతోపాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్‌

మీర్జాగూడ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని, మెరుగైన వైద్య సాయం కోసం హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. ప్రత్యేక అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచి బాధితులను ఆదుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రతిక్‌ జైన్‌, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, రవాణా శాఖ అధికారులు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page