– ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తే చూస్తూ ఊరుకోం
– రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు గర్హనీయం
– కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపాటు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: మహిళా రిజర్వేషన్‌తోపాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్‌లో తమ గళం వినిపిస్తామన్నారు. ఇలానే జరిగితే తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని ఎంపీ రవి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ తీవ్రంగా ఖండించారు. సీఎంను నోరు మూసుకుని కూర్చోమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అహంకారపూరిత మాటలను ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం అంటే కిషన్ రెడ్డికి విలువ లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలను కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. భారత దేశం ఐక్యంగా ఉండాలని ఇద్దరు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ప్రాణత్యాగం చేశారని ఎంపీ గుర్తు చేశారు. దేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం హడావుడి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనను రెండింటినీ ఒకటిగా చూపించి ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ఈ రెండు అంశాలు ఒకదానికి ఒకటి సంబంధం లేనివని మల్లు తెలిపారు. రెండింటినీ విడదీసి వేరువేరుగా చర్చించి అమలుకు విధివిధానాలపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోనే పురుషులతోపాటు మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు.. సోనియా గాంధీ నాయకత్వంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు.. అప్పుడు రాజ్యసభలో ఆమోదించారు. బీజేపీ సహకరించకపోవడం వల్లనే లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదంటూ ఇంతకాలం మోదీ ఈ బిల్లును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. 2026 తర్వాత జనాభా లెక్కల తర్వాత గెజిట్ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చట్టం చేశారన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 లోక్‌సభ సభ్యుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 181 మంది మహిళలు ఎన్నికయ్యేందుకు అవకాశం ఉండేదన్నారు. 2026 జనభా లెక్కలు పూర్తి చేసి అమలు చేయకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టం ముందుకు తెస్తున్నారన్నారు. మహిళా రిజర్వేషన్లు, పునర్విభజనను కలపడంలో రాజకీయ కుట్ర ఉందని మల్లు రవి ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




