ముందుగా గుర్తిస్తే కేన్స‌ర్ ను నివారించ‌వ‌చ్చు

– సిద్దిపేటలో కేన్సర్‌పై భారీ ముందడుగు
– శాశ్వత స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటుకు కృషి
– ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం
– వెయ్యి పడకల హాస్పిట‌ల్‌ నిధులపై హరీశ్ రావు విమర్శలు

సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 29: సిద్దిపేట ప్రజల ఆరోగ్య పరిరక్షణే తన జీవిత లక్ష్యమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని పిలుపు నిచ్చారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్‌కు చెందిన సింధు క్యాన్సర్ హాస్పిట‌ల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల నుంచి వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ తాను వైద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మూడో, నాలుగో దశలో కేన్సర్‌తో బాధపడుతున్న మహిళల పరిస్థితిని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. అందుకే ముందస్తు గుర్తింపుపై దృష్టి పెట్టి సింధు కేన్సర్‌ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పార్థసారథితో కలిసి సిద్దిపేటలో ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేన్సర్‌ భయపడాల్సిన వ్యాధి కాదని, ఆలస్యం చేస్తేనే ప్రమాదకరమవుతుందని ఆయన స్పష్టం చేశారు. 40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు 50 వేల కేన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అవగాహన లోపమే ప్రధాన కారణమని తెలిపారు. ఈ శిబిరంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆధునిక సౌకర్యాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.2.50 కోట్ల విలువైన మొబైల్ డయాగ్నస్టిక్ వాహనంలో మెమోగ్రఫీ, ఎక్స్‌రే, శాంపిల్ కలెక్షన్ వంటి సదుపాయాలు ఉన్నాయని వివరించారు. వ్యాధి గుర్తించిన వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత చికిత్స అందించేందుకు సింధు కేన్సర్‌ ఆసుపత్రి సిద్ధంగా ఉందని చెప్పారు.సిద్దిపేటలో శాశ్వత కేన్సర్‌ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హరీశ్ రావు ప్రకటించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి తరహాలో సేవలు అందించేందుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సింధు క్యాన్సర్ ఆసుపత్రి పనిచేస్తోందని ఆయన ప్రశంసించారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, 95 శాతం పనులు పూర్తయినా మిగిలిన నిధులు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. అదేవిధంగా హోమియోపతి, యునాని, ఆయుర్వేద హాస్పిట‌ల్‌ లకు వైద్యులు, సిబ్బంది నియామకంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. వెంటనే నిధులు విడుదల చేసి హాస్పిట‌ల్‌ లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింధు క్యాన్సర్ హాస్పిట‌ల్‌ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేష్, డాక్టర్ త్రిష, వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *