– సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో నిర్ణయం
– ఈసారి యాదగిరిగుట్టలో నిర్వహించే యోచన
– ఈసారి యాదగిరిగుట్టలో నిర్వహించే యోచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: ఈనెల 21న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అదే రోజున సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ సమావేశాన్ని 23వ తేదీన రాజధాని వెలుపల యాదగిరిగుట్టలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, పాలనా నిర్ణయాల్లో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణ అత్యంత ఆసక్తికరంగా మారింది. సరస్వతి నది అంత్య పుష్కరాలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఈ అంత్య పుష్కరాలకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ చరిత్రాత్మక వేడుకకు మంత్రివర్గంలోని మెజారిటీ మంత్రులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం, పుష్కరాల పనులను పర్యవేక్షించడం మంత్రులకు విధిగా మారింది. మంత్రులంతా పుష్కరాల పనుల్లో, అధికారిక పర్యటనల్లో నిమగ్నమవ్వ్లనుండటంతో ఆ రోజు నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ నెల 23న ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తున్నారు. హైదరాబాద్‌లోని సచివాలయానికే పరిమితం కాకుండా ప్రజలకు, పుణ్యక్షేత్రాలకు దగ్గరగా పాలనను తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగానే ఈ వ్యూహాన్ని రచిస్తున్నారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో కేబినెట్ భేటీ నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక, రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని సీఎం భావిస్తున్నారు. గతంలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క – సారలమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి మేడారంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన విషయం విదితమే. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, నిధుల విడుదలపై అక్కడికక్కడే కీలక నిర్ణయాలు తీసుకుని రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని యాదగిరిగుట్టలోనూ అమలు చేయాలని చూస్తున్నారు. దీనివల్ల స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించే అవకాశం లభిస్తుందని నమ్ముతున్నారు. అయితే ఈ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




