పదవులు రెండు.. ఆశావహులు పదుల్లోనే..

– ప్రభుత్వ కాల పరిమితి ఇక రెండున్నరేండ్లే
– అధిష్ఠానానికే విజప్తి చేసుకుంటున్న ఎమ్మెల్యేలు
– ప్రక్షాళన చేస్తే పరిస్థితి ఏమిటి?
– మంత్రివర్గ విస్తరణపై మల్లగుల్లాలు
– కార్పొరేషన్ల చైర్మన్‌ల భర్తీలో అసంతృప్తి
– బీజేపీ భయంతో ఆచితూచి అడుగులు

                                                                          (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు దాటినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోయింది. అందుకు అనేక కారణాలున్నాయి. మంత్రులు కావాలనుకునే ఆశావహుల జాబితా చాలా పెద్దదిగా ఉండటం అందులో ఒక కారణం. ఒకరిని తీసుకుంటే మరొకరు అలగకమానరు. దాంతో వాయిదాల పద్దతిలో మంత్రులను తీసుకుంటూ వచ్చింది. మంత్రి పదవి దక్కనివారు వచ్చేసారికైనా తమకు అవకాశం రాకపోతుందా అని సర్దుకుపోతారన్నది ఒక ఎత్తుగడ. కానీ ప్రభుత్వ కాలపరిమితిలో ఇప్పటికే సగం రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మంత్రులుగా తీసుకున్నా ఆ హాదాలో వారుండేది రెండున్నరేండ్లు మాత్రమే. మరింత జాప్యం చేస్తే కేవలం 18 నుండి 20 నెలలే వారు మంత్రులుగా కొనసాగాల్సి వస్తుంది. ఇదే విషయంపై ఆశావహులు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్రంలో 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముండగా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి దశలవారీగా ఇప్పటివరకు 16 మందిని మంత్రులుగా నియమించారు. ఇంకా ఇద్దరిని తీసుకునే అవకాశముంది. ఆ రెండు మంత్రి పదవుల కోసం పదిమందికిపైగా ఎమ్మెల్యేలు ఆశ పెట్టుకున్నారు. పోటీ తీవ్రం కావడంతో ముఖ్యమంత్రి అధిష్ఠానంతో కొంతకాలంగా చర్చిస్తూ వస్తున్నారు. ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికలతో కొంత జాప్యం జరిగింది. కేరళ సీఎం ఎన్నిక ప్రక్రియకూడా పూర్తి కావడంతో ఇక అధిష్థానం తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశముంది. దానికి తగినట్లు తాజాగా ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనలోకూడా దీన్నే ప్రధానాంశంగా చర్చించి ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. కేవలం మంత్రివర్గ విస్తర్ణే కాక మంత్రుల శాఖల మార్పు, ప్రక్షాళన కూడా ఉంటుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది.

ఉద్వాసన ఒకరికా.. ఇద్దరికా..

ప్రక్షాళనలో భాగంగా ఒకరిద్దరి పదవులకు ఉద్వాసన చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. ఆ ఒకరిద్దరి పనితీరు పట్ల ముఖ్యమంత్రితోపాటు అధిష్ఠానంకూడా అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మంత్రి పదవినుండి ఒకరిని తొలగిస్తారా, ఇద్దరినా.. వారెవరు అన్న విషయంలో ఊహాగానాలే తప్ప ఇదిమిత్థంగా స్పష్టత లేదు. మంత్రి పదవిపోయినా వారి గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా వారికి అందుకు సమానమైన అర్హతను కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్లు వినికిడి. ఈ మార్పులు, చేర్పులు ఎటు దారితీస్తాయోనన్న భయం మాత్రం పార్టీ వర్గాలకు లేకపోలేదు. ఎందుకంటే ఖాళీగా ఉన్నవి రెండు. మార్పులు చేర్పుల్లో ఒకటి లేదా రెండు రావచ్చు. కానీ మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న వారి జాబితా మాత్రం పెద్దగానే ఉంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అయితే తనకిస్తానన్న మంత్రి పదవి విషయంలో ఇప్పటికే నానాయాగీ చేస్తున్నారు. ఆయనకిస్తే ఒకే కుటుంబం నుండి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే ఇంతకాలం పెండింగ్ పెడుతూ వచ్చారు. ఇది చివరి అవకాశం. ఈసారి తనకు మంత్రి పదవి దక్కకపోతే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు.

జెండాలు మోసిన వారికి రిక్త హస్తాలేనా..

ఇప్పటికే కుల సహకార సంస్థలు, ఇతర సంస్థలకు సంబంధించి చైరÁ్మన్, వైస్ చైర్మన్‌ల నియామకం విషయంలో పార్టీ నాయకులు చాలావరకు అసంతృప్తితో ఉన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులు కేటాయించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి సేవచేస్తే అధికారం వచ్చిన తర్వాత తమకిచ్చే గౌరవం ఇదేనా అంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఈ విషయంలో చాలా తీవ్రంగా స్వీయ పార్టీ నేతలపైనే కామెంట్ చేశారు. జెండాలు మోసిన వారికి కాకుండా గులాంగిరి చేసిన వారికే పదవులిస్తారా అన్న ఆమె ఆరోపణ ఇప్పుడు కాంగ్రెస్‌లో సంచలనం రేపుతోంది. దశాబ్ధాలుగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని నిన్నమొన్న పార్టీలో చేరినవారు, ఎమ్మెల్యే టకెట్లు పొంది ఓడిపోయిన వారికే తిరిగి పదవులు కల్పిస్తే తమ పరిస్థితేమిటంటూ పలువురు ఆవేదన చెందుతున్న తరుణంలో కొత్తగా మంత్రులను తీసుకోవడం, ఇప్పటికే పదవుల్లో కొనసాగుతున్న మంత్రుల ప్రక్షాళన తేనెతుట్టెను కదిపినట్లు అవుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఆశావ‌హులు వీరే

జిల్లాల విషయానికొస్తే ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఇహ్రీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనకున్న సీనియారిటీ, చేసిన పనులను చూసి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ సరాసరి దిల్లీకి వెళ్లి పార్టీ అధినేత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసుకున్నారు. తనకివ్వడంద్వారా రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేసినట్లు అవుతుందన్నది ఆయన మాట. అంతకుముందే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అధిష్థానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి దిల్లీ వెళ్ళారు. డోర్నకల్ ఎమ్మెల్యే  రామచంద్రునాయక్ అయితే మంత్రి పదవి కోసం తనకిస్తానన్న డిప్యూటి స్పీకర్ పదవిని కూడా వదులుకున్నారు. కొత్తగా మంత్రులను తీసుకుంటారన్నప్పటినుండి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు కావడంవల్ల ఆయనకు తప్పనిసరిగా మంత్రి పదవి రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రముఖంగా వినిపిస్తున్న మరోపేరు ఎంఎల్సీ విజయశాంతి. పైకి చెప్పకున్నా చాలాకాలంగా మంత్రి పదవి కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. సీనియర్ నాయకుడు పి.సుదర్శన్‌రెడ్డికి గతంలో మంత్రి వదవి వస్తుందనుకున్నారు. ఈసారైనా వస్తుందా లేదా అన్న సందిగ్ధంలో ఆయన అనుచరగణం ఉంది. దేవరకొండ, మంచిర్యాల, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు బాలూనాయక్, ప్రేమ్‌సాగర్, మదన్‌మోహన్‌లు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ ఈసారి కాంగ్రెస్‌ను కుదిపేదిగా ఉంది. అయితే అధిష్ఠానంకూడా ఆచితూచి పదవులు కట్టబెట్టాలని చూస్తోంది. బెంగాల్ ఎన్నికలు చూసిన తర్వాత బీజేపీని తక్కువ అంచనా వేయవద్దని, అందుకు మంత్రి పదవులైనా, పార్టీ పదవులైనా సమర్థులకు ఇవ్వాలని పార్టీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *