కోర్టుపై నమ్మకం పోయింది

– దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై కేజ్రీవాల్‌ ‌వ్యాఖ్యలు
– ఈ మేరకు లేఖ విడుదల చేసిన కేజ్రీవాల్‌

‌న్యూదిల్లీ,ఏప్రిల్‌27:  ‌దిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆయన న్యాయమూర్తికి ఒక లేఖ రాస్తూ కోర్టుపై తనకు ’నమ్మకం పోయిందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అంతరాత్మ ప్రభోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్‌ ‌వెల్లడించారు. ’న్యాయం జరుగుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. అందుకే మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిగతంగా గానీ, కనీసం నా తరఫు న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకాను’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే, చట్టపరంగా తనకు ఉన్న హక్కుల ప్రకారం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, సోమవారం విచారణకు కేజ్రీవాల్‌ ‌గైర్హాజరు కావడంతో హైకోర్టు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బెంగాల్‌ ఎన్నికల వేడి, మరోవైపు కేజ్రీవాల్‌ ‌చుట్టూ తిరుగుతున్న ఈ న్యాయ వివాదాలు దేశ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి.మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో పాటు ఇతర నిందితులను ట్రయల్‌ ‌కోర్టు గతంలో విడుదల చేసింది. దీనిని సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ‌స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు. అయితే, ఈమె గతంలో కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను సమర్థిస్తూ తీర్పునిచ్చారని, అలాగే ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. ఈ కేసు నుంచి ఆమె తప్పుకోవాలని కేజ్రీవాల్‌ ‌పిటిషన్‌ ‌వేశారు. గత ఏప్రిల్‌ 20 ఈ ‌పిటిషన్‌ను జస్టిస్‌ ‌స్వర్ణకాంత శర్మ కొట్టివేశారు. ’న్యాయమూర్తుల నిజాయతీని లిటిగెంట్లు విచారించలేరు. కేవలం ఊహల ఆధారంగా రీక్యూసల్‌ ‌కోరలేరు’ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, స్వయంగా న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. న్యాయవ్యవస్థపై కేజ్రీవాల్‌కు గౌరవం లేదని బీజేపీ విమర్శిస్తుంటే, తమ నాయకుడికి అన్యాయం జరుగుతోందని ఆప్‌ ‌నేతలు ఆరోపిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *