బీఆర్ఎస్ సభ్యుల తీరు ప్ర‌జాస్వామ్యానికే మ‌చ్చ‌

– ఆయ‌న్ను ద‌ళిత స్పీక‌ర్ గా చూడ‌టం త‌ప్పు
-‎ తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదు
– చ‌ట్ట‌ స‌భ‌ల‌పై దాడికి ఫామ్ హౌజ్‌లో కుట్ర‌
– ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
– దామోద‌ర్ ప్ర‌తిపాదించిన తీర్మానానికి మ‌ద్ద‌తు
– ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

‎హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8: ‎శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, మొత్తం చట్టసభకు జరిగిన ఘోర అవమానమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రతిపాదించిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ ఆయ‌న‌ మాట్లాడారు. సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన సభ గౌరవానికి, స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. సభాపతిని అవమానించడ‌మంటే మొత్తం సభను అవమానించడమేన‌న్నారు. ఇది సభా ధిక్కారానికి స‌మానమ‌న్నారు. సభాపతిగా గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అన్ని పార్టీల సభ్యులు ఎన్నుకున్నారని, ఆయనను ఆ స్థానంలో కూర్చోబెట్టి సభను నడిపించే బాధ్యత అప్పగించారని గుర్తు చేశారు. ఆయన దళిత వర్గం నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి కావడం అదనపు గౌరవానికి కారణమని, అయితే ఆయనను దళిత స్పీకర్‌గా మాత్ర‌మే చూడటం సరికాదని, ఆయన మొత్తం శాసనసభకు స్పీకర్‌ అని  అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా తమ పాత భూస్వామ్య, ఫ్యూడల్ మనస్తత్వాన్ని మర్చిపోలేదనడానికి ఈ సంఘటనే సజీవ సాక్ష్య‌మ‌న్నారు. దళిత వర్గం నుంచి వచ్చి సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ కుమార్ ను గౌరవించకపోవడం ఆ పార్టీ నైజానికి అద్దం పడుతోందన్నారు. సభలో జరిగిన రచ్చ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగిందని, ఆ ఫామ్ హౌస్ కుట్ర‌లో ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు పథక రచన చేశారని ఆరోపించారు. కుట్ర‌దార్లు నడిపించిన రోల్ ప్లేయర్లుగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ప్రవర్తించారని, ప్రధాన సూత్రధారులు బీఆర్ఎస్ అత్యున్నత నాయకత్వమేనని అన్నారు. ‎సభలో టీషర్టులు, నల్ల చొక్కాలు ధరించి వాటిపై నినాదాలు రాసుకుని రావడాన్ని కూడా భట్టి తప్పుబట్టారు. సభలో బ్యాడ్జీలు, ప్రదర్శనాత్మక గుర్తులు ధరించరాదనే నిబంధనలు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రూల్‌ బుక్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. మీ ప్రభుత్వమే రూపొందించిన నిబంధనలను అమలు చేస్తున్న సభాపతిపై బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడం విడ్డూరమని  అన్నారు. నిబంధనలు అమలు చేసినందుకే సభాపతిని పరుష పదజాలంతో దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‎సభాపతి తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం దళిత వర్గాలకు సంబంధించిన అంశం కాదని, తెలంగాణ సమాజం సంస్కారం, సంస్కృతి, మహిళల పట్ల గౌరవానికి సంబంధించిన సమస్య అని అన్నారు. ‎తాను గతంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని గుర్తు చేశారు. మైక్‌ ఇవ్వకపోయినా, సభలోకి రావడాన్ని అడ్డుకున్నా ప్రజాస్వామ్యాన్ని, సభాపతి స్థానాన్ని గౌరవించామని అన్నారు. ‎బీఆర్‌ఎస్‌ విధానం ప్ర‌జాస్వామ్య స్ఫూర్తినే దెబ్బతీసేలా వుంద‌న్నారు. ఇలాంటి కుట్రదారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అన్నారు. ఫామ్‌హౌస్ కుట్ర‌ను శాసనసభ పూర్తిగా ఖండించాలని కోరారు. సభాపతిపై జరిగిన ఘటన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నేతలు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం మరింత బాధాకరమని అన్నారు. సభలో మళ్లీ సభాపతి స్థానాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం, ఆగ్రహంతో ముందుకు దూసుకెళ్లే పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హిత‌వు ప‌లికారు. ‎ప్రజాస్వామ్యంపై, తెలంగాణ ఆత్మగౌరవంపై, సామాజిక సమానత్వంపై దాడి చేసే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, వర్గాల మధ్య ఐక్యతను కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి విభజనాత్మక రాజకీయాలకు తావివ్వకూడదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *