బీఆర్ఎస్ లీడ‌ర్ల‌ ప్రవర్తన సిగ్గుచేటు

– కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
– బీఆర్‌ఎస్ సభ్యులపై చర్యల కోసం సభాపతికి విజ్ఞప్తి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8 : శాసనసభ సమావేశాల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులపై బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నాయకులు, శాస‌నస‌భ‌, శాస‌నమండ‌లిసభ్యుల ప్రవర్తనను, వారుఉపయోగించిన అవమానకరమైన పదజాలాన్ని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాస‌న స‌భ‌లో మంగ‌ళ‌వారం ఆమె మాట్లాడుతూ ప్రజాప్రతినిధులే మహిళా పోలీసుల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా వ్యవహరించడం సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పి  విధి నిర్వహణలో ఉన్న యువ మహిళా కానిస్టేబుళ్లపైకి రావడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందన్నారు. మానవత్వం తరఫున ఆ మహిళా పోలీసులకు తాను క్షమాపణ చెబుతున్నానంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే స్వేచ్ఛ ఉంది కానీ మహిళలను అవమానించే, సభాపతి పీఠాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, ప్రభుత్వ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని స్పష్టం చేశారు. సభా గౌరవాన్ని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అనుచితంగా ప్రవర్తించిన బీఆర్‌ఎస్ సభ్యులపై స్పీకర్ దృఢమైన, కఠినమైన నిర్ణయం తీసుకోవాలని పద్మావతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

పోలీసులుగా విధులు నిర్వర్తిస్తున్న యావత్ మహిళా సిబ్బంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

సభాపతి గౌరవాన్ని దిగజార్చారు

సభాపతి పీఠంతోపాటు ముఖ్యమంత్రి, మంత్రులపై బీఆర్‌ఎస్ నేతలు హేయమైన వ్యాఖ్య‌లు చేస్తున్నారని ఆరోపించారు. మైక్‌లో రికార్డు కాలేదనే సాంకేతిక కారణంతో వదిలేయకుండా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మావతి రెడ్డి స‌భాప‌తిని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *