– సూర్యాపేటలో ఘోరం!
– హంతకుల వేట కోసం ప్రత్యేక పోలీసు బృందాల రంగప్రవేశం
– నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం
– జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరిక
సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 23 : సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏర్కారం గ్రామ శివారులో ఘోర హత్యోదంతం వెలుగుచూసింది. రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు కింద గోనె సంచిలో కుక్కిన స్థితిలో ఉన్న ఒక యువకుడి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని ఏర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధుగా గుర్తించారు. శనివారం జిల్లా ఎస్పీ కె. నరసింహ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ, మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కేసును అన్ని కోణాల్లో పటిష్టంగా దర్యాప్తు చేసి, నిందితులను త్వరలోనే అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ.. చింతలపాటి మధు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో, అతడి భార్య సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని, మృతదేహం లభించడంతో హత్య కేసుగా మార్చినట్లు వెల్లడించారు. ఈ కేసును సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు చేస్తుండగా, డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోందన్నారని పేర్కొన్నారు. నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేసి, బెయిల్ రాకుండా జైలులోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




