– కాంగ్రెస్ సర్కార్‌పై, హామీలపై ఫిర్యాదుల వెల్లువ
– వెయ్యి రోజులు గడిచినా హామీలు నెరవేర్చని కాంగ్రెస్
- రైతు బంధు, నిరుద్యోగ సమస్యలపై వైఫల్యం
– మా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులు చేశారు
– దాడిపై గవర్నర్‌కు ఆధారాలు చూపాం: కేటీఆర్
హైదారాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 9: లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కలిశారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనపై, శాంతిభద్రతలు, ఇతర అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా గవర్నర్‌కు వివరంగా తెలిపామని కేటీఆర్ తెలిపారు. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని అరచేతిలో స్వర్గం చూపారని, కానీ ప్రభుత్వంలోకి వచ్చి వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు కింద గతంలో రూ.73 వేల కోట్లు ఇస్తే.. ఇప్పుడు యూరియా ఇవ్వట్లేదని తెలిపామని, రైతు బీమా ఎగ్గొట్టి రైతులకు ధీమా లేకుండా చేశారని, రాష్ట్రంలో నిరుద్యోగులను ఏవిధంగా మోసం చేశారో వివరించామని పేర్కొన్నారు.పార్లమెంటుకు రాహుల్‌గాంధీ వెళ్లినట్లే మేం నల్ల టీషర్టులు వేసుకుని వచ్చామని, వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్లామని కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ్యులపై నడిరోడ్డుపై పోలీసులు ఎలా దాడి చేశారో గవర్నర్‌కు ఆధారాలు చూపాం. సబితపై పోలీసుల దాడి, అవమానంపై, సునీత చీర లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపడంపై ఆధారాలు సమర్పించాం.. మాపై దాడులు చేసి మాపైనే కేసులు పెట్టారని గవర్నర్‌కు వివరించాం అని చెప్పారు. దాడులపై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు కాలేదు. మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించారని, ఈ దాడులపై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా తమ పార్టీ నేతలపైనే అక్రమంగా కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు.వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ వెయ్యి రోజులు గడిచినా 420కి పైగా వాగ్దానాలను గాలికొదిలేసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు కింద రూ. 73,000 కోట్లు అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం కనీసం యూరియాను కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. రైతు బీమాను నీరుగార్చి, నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిణామాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు కేటీఆర్ వివరించారు.
అవి ఏఐ ఫొటోలు .. వాటిని వాడిన వారిపై చట్టపరంగా చర్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా రూపొందించిన నకిలీ చిత్రాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ నేతలపై అసత్య ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏఐ రూపొందించిన ఫేక్ ఫొటోలు, వీడియోలను ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఈ నకిలీ ఫొటోలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, వాటిని రూపొందించిన, ప్రచారం చేసిన వ్యక్తులతోపాటు వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ ఫొటోలు, వీడియోలను నిజమైనవిగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను బీఆర్ఎస్ సహించబోదని స్పష్టం చేశారు. ఎలాంటి దాడులు జరగకపోయినా దాడులు జరిగినట్లుగా నకిలీ చిత్రాలు, కల్పిత కథనాలతో ప్రచారం చేయడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇలాంటి దుష్ప్రచారంలో మీడియా సంస్థలు భాగస్వాములు కావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఫేక్ ఫొటోలు, వీడియోలను ధ్రువీకరణ లేకుండా ప్రచురించవద్దని మీడియా సంస్థలకు సూచించారు. బీఆర్‌ఎస్ నేతల ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో నకిలీ కంటెంట్‌ను రూపొందించినా, ప్రచారం చేసినా, ప్రసారం చేసినా సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





