– అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
– బీపీటీ బియ్యం కిలో రూ.66కు మించకుండా చర్యలు
– ఐదు శాఖల సమన్వయంతో ముమ్మర దాడులు
– ఇప్పటికే 12 కేసులు
– సరిపడ బియ్యం నిల్వలు ఉన్నాయి.. ఆందోళన చెందొద్దు
– పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 30: బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్‌మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు విక్రయించి ప్రజలపై భారం మోపినా కఠిన చర్యలు తప్పవని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా లాభాలు సంపాదించాలనుకునే వారిని ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.బియ్యం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆయన బేగంపేట కుందన్ బాగ్ లోని తన క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో శుక్రవారం సమీక్షించారు. టోకు, చిల్లర వ్యాపారులు, రైస్‌మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు జరిపిన చర్చల వివరాలను తెలుసుకున్నారు. అక్రమాల నిరోధానికి చేపట్టిన ప్రత్యేక చర్యలు, తనిఖీల పురోగతిని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంత్రికి వివరించారు. శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఇతర ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు.సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే బీపీటీ బియ్యం ధర కిలో రూ.66కు మించకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్ఎన్ఆర్ బియ్యం విషయంలో నాణ్యత, ఉత్పత్తి వ్యయాల్లో ఉన్న వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుని ధరపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు తదితర అవకతవకల ఆరోపణలపై ఇప్పటికే బియ్యం వ్యాపారులపై 12 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఐదు శాఖల సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో టోకు, చిల్లర బియ్యం మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. బేగంబజార్, నాంపల్లి, మహరాజ్‌గంజ్ సహా ప్రధాన టోకు వ్యాపార కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని మంత్రి భరోసా ఇచ్చారు. కొరత వస్తుందనే ఆందోళనతో అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేసే వ్యాపారులు, మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని ఉత్తమ్ తెలిపారు. అదే సమయంలో అక్రమ వ్యాపార పద్ధతులతో ప్రజలపై భారం మోపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




