ప్ర‌జాప్ర‌భుత్వంలో ఇంటింటా సంక్షేమ సిరులు

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 31 : రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. . 2025 నూత‌న సంవ‌త్స‌రం స‌రికొత్త ఆనందాల‌ను, అంతులేని ఐశ్వ‌ర్యాల‌ను, ఆయు, ఆరోగ్యాలను ప్ర‌సాదించాల‌ని ఆ దేవుడిని ప్రార్థ‌న చేస్తున్నాన‌ని ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పును తీసుకువ‌చ్చేలా మీ అంద‌రి సంక‌ల్ప‌బ‌లంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చింద‌ని, ఇందిర‌మ్మ రాజ్యం తీసుకు వ‌దొచ్చేందుకు.. ద‌ళిత‌, గిరిజ‌న‌, బ‌హుజ‌న, ఆదివాసీ, మైనారిటీ స‌హా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్ని అందించేందుకు నిరంత‌రం కృషి చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్యారంటీల అమ‌లుతో తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకు రావడానికి ప్ర‌జా ప్ర‌భుత్వం శ్ర‌మిస్తోంద‌న్నారు.

అధికారంలోకి వొచ్చే నాటికే గ‌త పాల‌కులు ఖజానాలో ఒక్క రూపాయి లేకుండా చేసినా.. పైపెచ్చు సుమారు మైన‌స్ రూ. 4 వేల కోట్ల‌తో రాష్ట్రాన్ని అప్పగించినా.. ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల‌కు జాబ్ కేలండ‌ర్ ద్వారా నియామకాలు, రైతులకు రైతు భ‌రోసా, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ ఇస్తున్నామని, అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా దేశంలో ఎక్క‌డాలేని విధంగా ఒకేసారి రైతుల‌కు రూ. 2ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేశామ‌ని చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల‌ను అందించ‌ బోతున్నామ‌ని, అర్హ‌త‌లే ప్ర‌మాణికంగా, ప్ర‌తి తెలంగాణ బిడ్డ‌కు సంక్షేమ ప‌థ‌కాలను అందించేలా ప్ర‌జాపాల‌న నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఈ నూతన సంవత్సరాన.. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం క‌ల‌గాల‌ని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటా సంక్షేమ సిరులు కుర‌వాల‌ని కోరుకుతున్న‌ట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page