ఇన్‌స్టా వేదికగా వల విసిరిన బ్రదర్స్

– ఖరీదైన కార్లలో తిప్పుతూ అత్యాచారాలు
– మైనర్ల ట్రాప్ కేసులో ఆజాద్ తల్లి, మేనమామ అరెస్ట్
– వివరాలు వెల్లడించిన కమిషనర్ సజ్జన్నార్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్, చీటింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు అన్నదమ్ములు 19 మంది మైనర్లను ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. నిందితులను విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో మూడుగంటలపాటు నిందితులను సీపీ ప్రశ్నించారు. అర్జున్ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్, అతని సోదరుడు ప్రవీణ్‌లను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. సంపన్నుల మైనర్లను అర్జున్, ప్రవీణ్ టార్గెట్ చేశారని, వారిని ట్రాప్ చేసి ఖరీదైన కార్లలోనే లైంగిక చర్యలకు అర్జున్ పాల్పడ్డాడని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్కార్ట్‌గా ఉంటూ మైనర్లకు వల విసిరారని, 150మంది అమ్మాయిలు అర్జున్‌ను ఫాలో అవుతున్నారని చెప్పారు. ప్రస్తుతం అర్జున్ ప్రొఫైల్‌ను తాము లాక్ చేశామని తెలిపారు. ఇద్దరు నిందితులకు వారి తల్లి  మీనాకుమారి కూడా సహకరించినట్లు గుర్తించామన్నారు. నిందితుల కుటుంబం గుంటూరుకు చెందినదిగా తమ దర్యాప్తులో తేలిందన్నారు. బాలికలు ఆకర్షితులయ్యేలా ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్ రీల్స్ చేశాడని, ఇక్కడినుంచి బాలికలను ట్రాప్ చేసి రిచ్‌గా కారులో షికారు అంటూ హైదరాబాద్ రోడ్లపై అర్జున్ అన్నదమ్ములు తిప్పారని చెప్పారు. తమతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకునేలా బాలికలపై ఒత్తిడి చేశారన్నారు. ఆ వీడియోలను కూడా నిందితులు రికార్డు చేశారని, సమయం చూసి తాము ఓ బిజినెస్ మొదలుపెడతామని బాధితులను నమ్మించి డబ్బు అడిగేవారని తెలిపారు. అలా ఓ బాలిక ఇంట్లో తెలియకుండా రూ.13 లక్షలను నిందితులకు ఇచ్చిందన్నారు. గత ఏడాది కూడా ఇలాగే మరో మైనర్‌ను అర్జున్ ట్రాప్ చేశారని, ఈ కేసులో మూడు రోజులపాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. యువతులను బెదిరించి డబ్బులు కాజేసిన ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆజాద్ తల్లితోపాటు మేనమామను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖరీదైన కార్లలో తిరుగుతున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆజాద్ స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. యువతులకు దగ్గరై ఫొటోలు బహిర్గతం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో గత నెలలో ఆజాద్, అతడి సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. మోసపోయిన వారిలో ఎక్కువమంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. యువతుల నుంచి కాజేసిన సొమ్మును తల్లి, మేనమామ ఖాతాల్లో జమ చేసినట్లు విచారణలో తేలింది.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *