– దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు
లక్నో, మే 6: ఓ కామాంధుడిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ చేశారు. పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా కామాంధుడు హతమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. హర్దోయ్ జిల్లా మతియమౌలోని మొక్కజొన్న పొలంలో ఏడేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. చిన్నారిని అపహరించిన మెహనూర్ (32) అతడిపై అత్యాచారం చేశాడు. అనంతరం హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పడేశాడు. ఈ నేరాన్ని లైంగిక దాడిగా కాక డబ్బుల కోసం చేసిన కిడ్నాప్‌గా చిత్రీకరించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. దొంగిలించిన సిమ్ కార్డు సహాయంతో బాధిత కుటుంబానికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మెహనూర్‌పై రూ.50 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. అయితే హర్దోయ్ జిల్లా మల్లావన్ ప్రాంతంలో నిందితుడు మెహనూర్ ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అతన్ని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. నిందితుడు ఉన్న ప్రాంతానికి చేరుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా మెహనూర్ పోలీసులపైకి కాల్పులకు తెగపడ్డాడు. కామాంధుడి దాడిలో సీనియర్ ఎస్ఓజీ అధికారి రాజేశ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపగా మెహనూర్ ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అతని మృతదేహం వద్ద రెండు తుపాకులు దొరికినట్లు వెల్లడించారు. నిందితుడిని కన్నౌజ్ జిల్లావాసిగా గుర్తించినట్లు చెప్పారు. అతనికి నేర చరిత్ర ఉందని, పలు జిల్లాల్లో దాదాపు 12 కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



