– ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జి గిరీశ్ చోడంకర్ ప్రకటన
– తిరుచ్చి సీటును వదులుకోబోతున్న విజయ్
చెన్నై, మే 6: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు ప్రకటించింది. విజయ్ కోరకముందే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ అన్నాడీఎంకేను కలుపుకుంటారోనన్న భయం కాంగ్రెస్‌లో ఉంది. అందుకే టీవీకేకు మద్దతు తెలుపుతూ ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జి గిరీశ్ చోడంకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలనే ప్రధాన లక్ష్యంతోనే మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడులో లౌకిక, అభ్యుదయ, సంక్షేమ ప్రభుత్వాన్ని అందించడమే ప్రజల తీర్పు ఉద్దేశమని గిరీశ్ వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే కాక భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లోనూ టీవీకేతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. దీంతో తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకు కాంగ్రెస్- టీవీకే పొత్తు తెరలేపినట్లయ్యింది. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకి తమ పూర్తి మద్దతు అందించాలని కాంగ్రెస్ తమిళనాడు కమిటీ, శాసనసభా పక్షం నిర్ణయించాయి. తమిళనాడులో పెరుంతలైవార్ కామరాజ్ హయాం నాటి రోజులను తిరిగి తీసుకురావడానికి టీవీకే, తమిళనాడు కాంగ్రెస్ మధ్య ఏర్పడిన ఈ కూటమి కృషి చేస్తుంది అని కాంగ్రెస్ ప్రస్తావించింది. ఇక టీవీకే గురువారం ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్, కోలీవుడ్‌లో గ్లామర్ తార త్రిషా కృష్ణన్ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నదా.. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తిరుచిరాపల్లి(తిరుచ్చి) ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన విజయ్ ఒకచోట రాజీనామా చేయాలన్న రాజ్యాంగ నిబంధన నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఖాళీ అయ్యే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న దానిపై చర్చలు జోరందుకున్నాయి. టీవీకే నిర్ణయమేమిటో తెలియదు గానీ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం బైపోల్ టికెట్ త్రిషకే అని కమిట్ అయిపోతున్నారు. సీఎం అవుతానంటూ గతంలో త్రిష కామెంట్స్ చేయడం, ఇప్పుడు త్రిష రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెబుతున్న విజయ్ పార్టీ టీవీకే గెలుపొందడం, విజయ్ పోటీ చేసిన రెండింటిలో ఒకచోట బైపోల్ వచ్చే అవకాశం ఉండటం.. వెరసి పరిస్థితులన్నీ త్రిష తన కలను నెరవేర్చుకునేందుకు సహకరిస్తున్నాయా అని నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



