ఖమ్మం రైల్వే స్టేషన్ అంటే ఒక విచిత్ర సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను, అయ్యర్ ఒక రోజు హైదరాబాద్ రావల్సివచ్చింది. ఒక కారు తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయల్దేరాం. విజయ రాఘవన్ అనే మా మిత్ర ఇంజినీర్ మాతో ఖమ్మం దాకా కారులో వస్తాననీ, అక్కడ నుండి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ ‘మద్రాస్ ఎక్స్ ప్రెస్’ లో మద్రాసుకు పోవడానికి టికట్ బుక్ చేసుకున్నాననీ బయలు దేరాడు. అందరం ఖమ్మం చేరి స్టేషన్ దగ్గరే వున్న ఒక మంచి హోటల్ లో భోజనం చేసాం. అప్పటికి రాత్రి 8.55 అవుతుంది. ట్రైన్ టైం అయింది పోదాం అంటే మన వాడు ‘మన దేశంలో ఎప్పుడైనా ట్రైన్ టైముకు వచ్ఘ్చిందా!’’ వ్యంగ్యంగా అని నెమ్మదిగా సిగరెట్టు నాలుగు దమ్ములు తాగి కారు ఎక్కాడు. స్టేషను ముందు ముగ్గురం దిగాం. అప్పటికి తొమ్మిది దాటి 3 నిమిషాలైంది. ప్లాట్ ఫారం పైకి పోయే గేటు దగ్గరకు చేరుకునేసరికి ఆ ట్రైన్ చిట్ట చివరి బోగీ మా ముందునుంచే వెళ్ళిపోతున్న అపురూప దృశ్యం కనబడిరది. ఇక మన వాడి ముఖం చూడాలి. ఇప్పటి టికెట్ వేస్ట్. పైగా నెక్స్ట్ వచ్చే జీ టీ ఎక్స్ ప్రెస్ లో టికట్ కలెక్టర్ దగ్గర రిజర్వేషన్ దొరక కుండా వుంటే జనరల్ కంపార్ట్ మెంటులో ప్రయాణం చేయాలి. తరువాత మాకు తెలిసింది ఏమిటంటే జనరల్ కంపార్ట్ మెంటే ఆయనకు గతి అయిందని!
(జనవరి 26 సంచిక తరువాయి )
ఇంకో సారి అర్జెంట్ గా ‘సూట్ బ్లోయర్లు ‘ అనే యంత్ర భాగాలు
పనిచేయించడానికి కావల్సిన కంట్రోల్ స్విచ్చులు కావలసి వచ్చింది. వీటిని బొంబై (ఇప్పటి ముంబై) లోని ‘ఎల్ Ê టీ కంపెని సప్ప్లై చేయాలి. కాని అవి రాలేదు. వాళ్ళు ట్రాన్స్ పోర్ట్ లో పంపిస్తే ఆలస్యమవుతుంది. ఎవరైనా బొంబై పోయి వాటిని తీసుకురావాలి. కాని బొంబై అంటే అందరూ భయ పడుతున్నారు. అక్కడ కొత్త వారిని మోసగాళ్ళు దోచేస్తారని. పైగా చాలా మందికి హిందీ రాదు. చివరకు మా రెసిడెంట్ ఇంజినీరు గారు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ‘సరే’ అని ఒక బ్రీఫ్ కేసులో ఒక జత బట్టలతో ఖమ్మంలో ‘కోణార్క్ ఎక్స్ ప్రెస్’ ఎక్కాను. ఇదే రైలుబండి ‘మినార్ ఎక్స్ ప్రెస్ ‘ పేరుతో సికిందరాబాదులో బయలు దేరి మరుసటి ఉదయం 6 గంటలకు బొంబై వీ టీ స్టేషన్ చేరుతుంది.
ఆ విధంగా బొంబై వీటీ లో దిగిన నేను ముందుగా రిటైరింగ్ రూం తీసుకోని అక్కడే స్నానం ముగించుకొని డ్రెస్సు మార్చుకున్నాను. తర్వాత క్రిందకు వచ్చి క్లోక్ రూం కు పోయి కావాల్సిన పేపర్ల ఫైల్ తీసుకొని అక్కడ నా బ్రీఫ్ కేసును డిపాజిట్ చేసాను. 8 గంటలకు బుకింగ్ కౌంటర్ తీయగానే హైదరాబాదుకు ఫస్ట్ క్లాస్ టికట్ (బొంబై హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ) తీసుకుంటే వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 47. స్టేషన్లోనే ప్లాట్ ఫారం మీదనే వున్న ‘ఏ హెచ్ వీలర్’ బుక్ స్టాల్ కు పోయి బొంబై నగర గైడ్ కొన్నాను. తర్వాత పైన వున్న రైల్వే పలహారశాల లో టిఫిన్ చేయడానికి కూర్చొని ‘ఎల్ %డ% టీ కంపెనీ వున్న’ బల్లార్డ్ ఎస్టేట్’ అనే ప్రదేశం ఎక్కడ వుందని గైడు పుస్తకంలో వెతక సాగాను. ఒక పది నిముషాల తర్వాత ఆ ప్రదేశం వున్న ఏరియా తెలిసింది. నన్ను సంతోషపరిచిన విషయం ఏమిటంటే అది వీ టీ రైల్వే స్టేషనుకు 2 కిలోమీటర్ల దూరం లోనే వుందన్న విషయం.
ఇక మెళ్ళిగా నడక సాగించి ఆ ఏరియాకు పోయి అక్కడనే ఒక మూలగా వున్న టేక్సీ స్టాండుకు చేరి ఒక టెక్సీ డ్రైవరు ను ‘ఎల్ %డ% టీ కంపేనీ ఎక్కడ వుందని’ అడిగాను. నా చేతిలో వున్న ఫైల్ ను చూసి నేను ఏదో ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థి అనుకొని డైరెక్షన్సు ఇచ్చాడు. ఒక పది నిముషాలలో 5 అంతస్థుల భవనం లోని ఆ కంపెనీ కమ్మర్షియల్ మేనేజర్ ముందు కూర్చున్నాను. వారి దగ్గర ఐన ఆలస్యానికి నాకు క్షమాపణలు చెప్పి , అవి రెడీగా వున్నాయని ‘భాండూప్’ ఇండస్ట్రియల్ ఏరియా లో వున్న వాళ్ళ స్టోర్స్ మేనేజరు కు ఫోన్ చేసి వాటిని ప్యాకు చేసి అర్ధగంటలో రెడీగా వుంచమని చెప్పి నేను వచ్చి వాటిని తీసుకుంటానని అతనికి తెలిపారు. అందుకు సంబంధించిన పేపర్లను నా కిచ్చి టీ తాగించి నన్ను డోర్ దాకా వచ్చి సాగనంపాడు. నేను క్రిందకు దిగి మళ్ళీ ఆ టేక్సీ స్టాండుకు పోయాను. అక్కడ ఒక సర్దార్జీ డ్రైవర్ టెక్సీ ముందు నిలబడి దానికి ఆనుకొని ఏదో పత్రిక తిరిగేస్తున్నాడు. నేను అతనికి నమస్తే చెప్పి భాండూప్ ఏరియా కు పోయి అక్కడి నుండి తిరిగి వీ టీ స్టేషను కు రావాలని ఎంత తీసుకుంటావని హిందీలో అడిగాను. అతను 60 రూపాయలు అని చెప్పాడనుకుంటా.
సరే అని బయలు దేరాము. ఒక గంటన్నరలో పెద్ద సూట్ కేసు సైజు కర్ర పెట్టెతో వీ టీ చేరుకున్నాము. ట్రైన్ 1.30 గంటలకు. ఒక కూలీని పిలిచి ఆ పెట్టెను ప్లాట్ ఫారం మీద ఫస్ట్ క్లాస్ డబ్బా ఆగే చోట పెట్టి తిరిగి ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు అందులో ఎక్కించాలని ఎంత కావాలని హిందీలో అడిగాను. అతను చెప్పిన రేటుకంటే ఒక 5 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పాను. మొత్తానికి దానిని ప్లాట్ ఫారం మీదకు చేర్చాము. నేను సర్దార్జీని తీసుకుపోయి రైల్వే కేంటీన్లో సమోసాలు తినిపించి ఒక పది రూపాయలు ఎక్కువగానే ఇచ్చాను. అతను సెల్యూట్ కొట్టి వెళ్ళి పోయాడు. ట్రైన్ వచ్చి ప్లాట్ ఫారం మీద ఆగింది. నేను టికట్ కలెక్టరును కలిసి నా టికట్ చూపిస్తే అది కంఫర్మ్ కాదు అని తెలిపాడు. సరిగ్గా ట్రైన్ బయలు దేరే ముందు ఆ పోర్టర్ వచ్చి బాక్సును రెండు బాత్ రూముల మధ్య వున్న ఖాళీ స్థలం లో ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో పెట్టాడు. ఫస్ట్ క్లాసులో పగలు 6 గురు కూర్చోడానికి రాత్రి 4 నలుగురు పడుకునే అవకాశమున్న కుపేలు వుంటాయి.
ట్రైన్ స్టార్ట్ కాగానే నేను ఒక కుపేలో కూర్చున్నాను. అప్పటికే అక్కడ నలుగురున్నారు. ఈ లోపల టికట్ కలెక్టర్ వచ్చి ‘ఎందుకెక్కావని’ నన్ను హిందీ లో ప్రశ్నించాడు. నేను హిందీ లోనే 6 గంటల వరకు ట్రైన్ పూనా చేరుతుంది కాబట్టి నేను అక్కడ దిగిపోతానని చెప్పి ఇది చాలా ముఖ్యమైన ప్రభుత్వ పని అని బీహెచ్‌ఇఎల్ గురించి చెప్పాను. వేరే కుపేకు పోయిన ఆ టీ సీ తన ఖాఖీ దుస్తుల అసిస్టెంట్ ను పంపించి పిలిపించుకొని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని టికెట్ కన్ఫర్మ్ చేశాడు. పొద్దున్నే నాంపల్లి స్టేషనుకు, అక్కడి నుండి మధ్యాహ్నం రెండిరటి వరకు కృష్ణా ఎక్స్ ప్రెస్ లో ఖమ్మం వరకు పయనించి మా ఆఫీసు జీపులో పాల్వంచ చేరడంతో కథ సుఖాంతమైంది. మా రెసిడెంట్ ఇంజినీర్ గారు సంతోషంతో వారింట్లో నాకు ఆ రోజు డిన్నర్ పార్టీ ఇచ్చారు. మరునాడు ఆఫీసులో ఈ ప్రయాణ కథను అందరికీ వినిపించాను. (వచ్చే వారం మరికొన్ని పాల్వంచ ముచ్చట్లు)
` శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు




